ఆదిలాబాద్ లో ఉద్రిక్తత
ఆదిలాబాద్‌లో డిజిటల్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ఫొటోలు పెట్టకపోవడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ ఫొటోతో కార్యక్రమానికి వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు.
ఆదిలాబాద్ ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన డిజిటల్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రుల ఫొటోలు ఏర్పాటు చేయగా.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ఫొటోలు లేకపోవడంపై బీజేపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో జరుగుతున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ బీజేపీ నాయకులు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాయల్ శరత్ aఆధ్వర్యంలో పలువురు కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు ప్రధాని మోదీ ఫొటోను చేతబట్టి కార్యక్రమం వద్దకు వచ్చారు.
అయితే బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు బీజేపీ నేతలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో నేతలు మనోజ్ పవర్, హనుమాన్లు సహా పలువురు బీజేపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమానుషంగా లాఠీచార్జ్ చేశారంటూ ఖండించారు.
మోదీ ఫొటో లేకపోవడం మొదలైన వివాదం.. బీజేపీ నేతల నిరసన, పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో కొద్దిసేపు ఎస్టీయూ భవన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.