కారులో మేకల దొంగతనం
నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
మేకలపై కన్నేసిన దొంగలు.. కారులో వచ్చి మరీ చోరీకి పాల్పడ్డారు. దొంగిలించిన మేకలను కొనుగోలు చేసేందుకు మరో ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. అయితే.. పోలీసులు రంగంలోకి దిగడంతో దొంగల ఆట గంటల్లోనే కట్టేశారు. సీసీటీవీ ఫుటేజీలు, పక్కా సమాచారంతో దర్యాప్తు చేపట్టిన ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు.. చోరీకి పాల్పడిన ఇద్దరితో పాటు మేకలను కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు మేకలు, కారు, సెల్ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని జై జవాన్ నగర్లో మేకల చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. కారులో తిరుగుతూ మేకలను దొంగతనం చేస్తున్న ఇద్దరితో పాటు, దొంగిలించిన మేకలను కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో జై జవాన్ నగర్‌కు చెందిన కోహినూర్ బేగం తన మేకలు కనిపించడం లేదని డయల్-100 ద్వారా టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు ఆదేశాల మేరకు ఎస్సైలు అఖిల్, ప్రణయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలించడంతో పాటు అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో కారులో వచ్చి మేకలను చోరీ చేస్తున్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సిర్సన్న గ్రామానికి చెందిన మహమ్మద్ పర్వేజ్, షేక్ ఐజాన్ మేకలను దొంగతనం చేసి, వాటిని ఆసిఫ్ ఖాన్, మహమ్మద్ ఫిర్దోస్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద ఐదు దొంగతనం చేసిన మేకలు, ఒక కారు, మూడు సెల్ఫోన్లు, రూ.2,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.
కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి గంటల వ్యవధిలోనే ఛేదించిన ఎస్సైలు అఖిల్, ప్రణయ్‌తో పాటు పోలీసు సిబ్బంది విఠల్, శ్రీకాంత్, క్రాంతిలను టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు ప్రత్యేకంగా అభినందించారు. పశువులు, మేకల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.