కాంగ్రెస్ నేతల రచ్చ.. ఉట్నూర్‌లో పీఏసీ సమావేశంలో గొడవ!
కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో కాంగ్రెస్ నేతలు గొడవకు దిగారు. నాలుగు జిల్లాల నేతల సమావేశంలో భాగంగా ఆదిలాబాద్ పిఏసీ సమావేశం నిర్వహించారు. అయితే, అందులో తమ పేర్లు లేకపోవడం తో ఆదిలాబాద్ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ , ఉమ్మడి జిల్లా ఇన్ చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుటే వారు గొడవకు దిగారు. దీంతో నేతలను బయటకు వెళ్లాలని క్రమశిక్షణ పాటించాలని మంత్రి జూపల్లి సూచించారు. దీంతో నేతలు బూతు పురాణం అందుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఈ రోజు (సోమవారం) ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉట్నూర్‌లోని నాగిరెడ్డి గార్డెన్‌లో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశానికి హాజరయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. జిల్లాలో సంస్థాగత వ్యవహారాలు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై జిల్లాల వారీగా సమీక్ష కొనసాగుతోంది.