ఏఐసీసీ పెద్దల ముందే ‘హస్తం’ పంచాయితీ..!
Congress PAC Meeting:హస్తం పార్టీలో మళ్లీ లొల్లి మొదలుకానుందా..? ఇన్ని రోజులు ఎవరి నియోజకవర్గంలో వాళ్లు కత్తులు దూసుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ఏఐసీసీ పెద్దల ముందే తమ పంచాయితీలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారా..? పార్టీ బలోపేతం కోసం ఏర్పాటు చేస్తున్న సమావేశమే.. అసంతృప్త నేతలకు అస్త్రంగా మారనుందా..? డీసీసీల ఒంటెద్దు పోకడలు.. నియోజకవర్గ ఇన్చార్జీల పెత్తనం.. ఎమ్మెల్యేల తీరుపై నేతలు గళమెత్తనున్నారా..? ఉట్నూర్ వేదికగా కాంగ్రెస్‌లో ఏం జరగబోతోంది..? నాంది న్యూస్ ప్రత్యేక కథనం..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో కయ్యాలు కొత్తేమీ కాదు… ఒకరు ఎడ్డెం అంటే మరొకరు తెడ్డెం అంటారు.. పదవుల కోసం పందేరం ఎత్తులు పై ఎత్తులు, గొడవలు ధర్నాలు ఫిర్యాదులు పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక తరహా అయితే, నిర్మల్ జిల్లాలో మరో తరహా… మంచిర్యాలలో ఇంకో తరహా.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏకంగా గాంధీభవన్ ఎదుటే ఆందోళనలు. ఇలా నాలుగు జిల్లాల్లో విబేధాల కత్తులు దూసుకుంటున్నాయి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఇదే సమయంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్(AICC Secretary Sachin Sawant), ఉమ్మడి జిల్లా ఇన్ చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఉట్నూర్ లో నాలుగు జిల్లాల సమీక్ష నిర్వహించనున్నారు.
అయితే, కక్షలు కార్పణ్యాలతో రగులుతున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ దీన్ని అవకాశంగా మలుచుకోనున్నారు. ఇప్పటికే ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ(DCC President Athram Suguna) మార్పుపై సీనియర్లు ఒత్తిడి తెస్తుండగా, మరోసారి ఆ అంశాన్ని తెరపైకి తేనున్నారు. పార్టీ సీనియర్లను పట్టించుకోవడం లేదని ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు. మండల అధ్యక్ష ఎంపికపై సైతం వివాదం రాజుకుంది. ఇవే అంశాలపై ఏఐసీసీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లేందుకు నేతలు సిద్ధం అవుతున్నారు.
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యవహార శైలిపైనా విమర్శలు ఉన్నాయి. జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉంటే కేవలం ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారని, పార్టీని కనీసం పట్టించుకోవడం లేదనే అభియోగాలు ఉన్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ లపై వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండరని, ఒకరిద్దరు కేవలం నెలకు ఒకసారి చుట్టపుచూపుగా వచ్చిపోతుంటారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో పదవుల ఎంపిక వివాదం అయ్యింది. వ్యక్తిగతం తప్ప పార్టీ బలోపేతానికి కృషి చేయరనే అపవాదు ఉంది. దీనికి తోడు ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకునేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ సమావేశాన్ని వారు అస్త్రంగా మలుచుకోనున్నట్లు సమాచారం.
ఆదిలాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవుల ఎంపికలో వివాదం రాజుకుంటోంది. ఇచ్చిందే తక్కువే… అందులో రెడ్డి, రావులకే పదవులు దక్కడంతో మిగతా వర్గాలు గుర్రుగా ఉన్నాయి. రాబోయే పదవులకు సైతం రెడ్డి రావులు కాచుకుని కూర్చోవడంతో పార్టీలో సమన్యాయం ఎక్కడా అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఒక నియోజకవర్గ ఇన్చార్జీ ఎక్కడ ఉంటాడో తెలియదు.. మరో నియోజకవర్గ ఇన్ చార్జీ పదవులు, నిధులు కోసం తప్ప మిగతా ఏం విషయం గురించి అధిష్టానం వద్దకు వెళ్లడనే అపవాదు ఉంది. జనంలో ఉండరు.. సీనియర్లను పట్టించుకోరు.. అందరినీ కలుపుకోవాలనే తప్ప డీసీసీ అధ్యక్షుడు నరేష్‌జాదవ్(DCC President Naresh Jadhav)కు ఉన్నప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జీలు మాత్రం తమ నియోజకవర్గానికి తామే బాస్ అన్నట్లుగా వ్యవహరిస్తుండటం పార్టీ బలోపేతానికి అడ్డంకిగా మారుతోంది.
ఇక నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది పరస్థితి. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు(DCC President and MLA Vedma Bojju) ఉండగా నియోజకవర్గ ఇన్చార్జీలు తమ నియోజకవర్గాలను గాలికి వదిలేశారు. పైరవీల కోసం పనులు చేయరనే అభిప్రాయాలు ఉన్నాయి. నిర్మల్‌లో అగ్రవర్ణ నాయకుల పెత్తనం, డీసీసీ అధ్యక్షున్ని పట్టించుకోనితనం పార్టీకి మైనస్‌గా మారుతోంది. డీసీసీ అధ్యక్షుడు ఆదివాసీ అనే చిన్నచూపా..? లేక మరేదైనా కారణం కావచ్చు కానీ, రెండు నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల పెత్తనం పెచ్చుమీరుతోంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల పెత్తనం పెరిగిపోతోంది. పోనీ, వారు పార్టీని పట్టించుకుంటారా…? అంటే అది కూడా లేదు. అధిష్టానం పెద్దలతో ఉన్న దోస్తానా… చుట్టరికం.. డీసీసీ అధ్యక్షుడికి తెలియకుండానే పదవులు వస్తున్నాయి… వెడ్మబొజ్జు ఇదే అంశాన్ని ఏకంగా రెండు, మూడు సభల్లోనే ప్రస్తావించారు.
మొత్తంగా.. ఇన్నాళ్లు అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తులకు ఉట్నూర్ సమావేశం వేదిక కానున్నట్లు కనిపిస్తోంది. ఎవరి సమస్యలు వారు ఏఐసీసీ నేతల ముందు ఏకరువు పెట్టేందుకు సిద్ధమవుతుండటంతో.. ఈ సమావేశం పార్టీ బలోపేతానికి బాటలు వేస్తుందా..? లేక కాంగ్రెస్‌లో మరోసారి విభేదాల మంటలు రాజేస్తుందా..? అనేది ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.