కూరగాయలు రోడ్డు పై పోసి ఆందోళన
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని రామ్ మందిరం ఎదుట కూరగాయల విక్రయాలపై వివాదం కొనసాగుతోంది. రామ్ మందిరం ఎదురుగా కూరగాయలు విక్రయించవద్దంటూ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో రైతులు, కూరగాయల వ్యాపారులు ఆందోళనకు దిగారు.
కూరగాయల విక్రయాల కోసం మున్సిపల్ అధికారులు కేటాయించిన స్థలంలో వ్యాపారం చేయడం తమకు సాధ్యం కాదని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రామ్ మందిరం వద్దే కూరగాయలు విక్రయించేందుకు వారు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ నేపథ్యంలో కూరగాయల విక్రయాలను అడ్డుకునేందుకు పోలీసులు ఈరోజు ఉదయం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల చర్యకు నిరసనగా కూరగాయల వ్యాపారులు తమ సరుకును రోడ్డుపై పడవేసి అక్కడే బైఠాయించారు. దీంతో రామ్ మందిరం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తమ సమస్యను పరిష్కరించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్కు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. వివాదం మరింత ముదరకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.