ఇనుపరాడ్లే ప్రాణాలు తీశాయి… రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
Kodada Bus Accident | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కోదాడ మండలం దొరకుంట శివారులో రోడ్డుపై ఆగివున్న కంటైనర్ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఆరుగురు మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దొరకుంట శివారు దగ్గర జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద తీవ్రత పెరగడానికి కంటైనర్ లారీలో ఉన్న ఇనుప రాడ్లని అధికారులు చెబుతున్నారు. లారీలో పరిమితికి మించి, ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా లోడ్ చేసిన ఇనుప రాడ్లు ఈ ఘోరానికి ప్రధాన కారణమయ్యాయి. బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టగానే, ఆ అతి భారీ ఇనుప రాడ్లు బస్సు ముందు భాగం అద్దాలను పగులగొట్టుకుని లోపలికి అత్యంత వేగంగా దూసుకెళ్లాయి. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరగడంతో, వారికి కనీసం తేరుకునే అవకాశం కూడా దక్కలేదు. కళ్లు తెరిచి చూసేలోపే ఇనుప రాడ్లు వారి శరీరాల్లోకి చొచ్చుకుపోయాయి.
బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లనో లేకపోతే ముందు ఆగి ఉన్న లారీని సకాలంలో గమనించకపోవడం వల్లే ఈ దుర్ఘటన సంభవించిందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే కోదాడ పోలీసులు, జాతీయ రహదారి భద్రతా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని, ఇనుప రాడ్ల మధ్య చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు గ్యాస్ కట్టర్ల సహాయంతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
గాయపడిన 20 మంది ప్రయాణికులను వెంటనే అంబులెన్స్‌ల ద్వారా కోదాడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ భారీ ప్రమాదం కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, పోలీసులు క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన బస్సును, లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతులలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర కంటైనర్‌ను ఢికొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.