బొగ్గు నుంచి బంగారం దాకా.. సింగరేణికి కొత్త దిశ..

‎తెలంగాణ రాష్ట్రానికి ఆత్మ లాంటి  అత్యుత్త‌మ ప్ర‌భుత్వ రంగ సంస్థ సింగరేణిని కాపాడుకుంటూ, భవిష్యత్ తరాలకు కూడా లాభదాయ‌క సంస్థ‌గా అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బొగ్గు బ్లాక్‌లు సాధించ‌డంలో సంపూర్ణ స‌హ‌కారం అందిస్తున్న భ‌ట్టి విక్ర‌మార్కను సింగ‌రేణిలోని గుర్తింపు, ప్రాతినిథ్య‌, అధికార సంఘాల నాయ‌కులు స‌చివాల‌యంలో ఘ‌నంగా స‌న్మానించారు.

‎​ ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాక్‌లను తీసుకోకపోవడం, ఉన్న గనులను మూసివేయడం వల్ల సింగరేణికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఐదారు సంవత్సరాల్లో సంస్థ మూతపడే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రులు గట్టి పట్టుదలతో నైని కోల్ బ్లాక్ సాధించామని చెప్పారు.

2013లో యూపీఏ ప్ర‌భుత్వం సింగ‌రేణికి రీ-అసైన్ చేసిన తాడిచర్ల-2 కోల్ బ్లాక్ విషయాన్ని కేంద్రంతో మాట్లాడి మైనింగ్ లీజు ద‌క్కించుకోవ‌డంలో  ప్రభుత్వం సఫలమైందని తెలిపారు. అంతేకాకుండా జెన్కోను ఒప్పించి, సింగరేణికి వేలంలో మ‌ణుగూరు డిప్ సైడ్ బ్లాక్ -2 ద‌క్కేలా కృషి చేశామ‌న్నారు.  ఒడిశాలోని ‘నైనీ’ బ్లాక్ సమస్యల పరిష్కారానికి స్వయంగా వెళ్లి స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి మార్గం సుగమం చేశామని వెల్లడించారు.

‎​ ప్రపంచవ్యాప్తంగా సోలార్, విండ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వస్తుండటంతో భవిష్యత్తులో థర్మల్ పవర్ డిమాండ్, బొగ్గు వినియోగం తగ్గే అవకాశం ఉందన్నారు. కేవలం బొగ్గుపైనే ఆధారపడితే సింగరేణి కూడా BSNL లాగా వెనుకబడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే ప్రపంచ మార్పులకు అనుగుణంగా కాపర్, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్ వంటి ‘క్రిటికల్ మినరల్స్’ (కీలక ఖనిజాలు) మైనింగ్ వైపు సింగరేణిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ​అంతర్జాతీయ అవకాశాలను అధ్యయనం చేసేందుకు సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, చిలీ వంటి దేశాల కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్లను నియమించామని డిప్యూటీ సీఎం చెప్పారు.

‎​ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వ‌ర్యంలో సింగరేణి కొత్త‌ గనుల ప్రారంభం, వ్యాపార విస్తరణతో శరవేగంగా ముందుకు సాగుతోందని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనియాడారు. భవిష్యత్తులో సింగరేణిని దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు.

‎ సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘం అధ్య‌క్షులు వాసిరెడ్డి సీతారామ‌య్య‌, ప్రాతినిథ్య కార్మిక సంఘం సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ జ‌న‌క్ ప్ర‌సాద్‌, అధికారుల సంఘం అధ్య‌క్షులు ల‌క్ష్మీప‌తి గౌడ్‌ మాట్లాడుతూ సింగ‌రేణి కోసం అతికీల‌క‌మైన నైనీ బొగ్గు బ్లాక్ సాధ‌న కోసం ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఒడిశా వెళ్లి అక్క‌డ ముఖ్య‌మంత్రిని, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఒప్పించి అన్ని అనుమ‌తులు సాధించార‌ని కొనియాడారు. ఆయ‌న కృషి ఫ‌లితంగా గ‌త ఏడాది నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఉత్ప‌త్తి ప్రారంభ‌మైంద‌న్నారు. 2013లో యూపీఏ ప్ర‌భుత్వ కేటాయించిన తాడిచెర్ల -2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు సాధించ‌డంలోనూ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కృషి చేశార‌ని ప్ర‌శంసించారు.

కార్య‌క్ర‌మంలో సింగ‌రేణి  గుర్తింపు కార్మిక సంఘం జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ రాజ్ కుమార్‌, ప్రాతినిథ్య కార్మిక సంఘం సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ న‌ర్సింహారెడ్డి, అధికారుల సంఘం అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు ల‌క్ష్మీప‌తి గౌడ్‌,పెద్ది న‌ర్సింహులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

You might also like