విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాగుపడలేదు
-జీవో 97 ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి
-బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్
పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి విభాగం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97 ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ డిమాండ్ చేశారు. మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట పాల్టెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు.
జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ఛిన్నాభిన్నం అవుతుందన్నారు. గతంలో పాలిటెక్నిక్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో నేరుగా జాయిన్ అయ్యే వారని, కానీ జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్మీడియట్ చదవాలని తద్వారా విద్యార్థులకు సమయం వృథా అవుతుందన్నారు. అంతేకాకుండా, ఆర్థిక ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు. ఈ మధ్యకాలంలో విద్యార్థులతో పెట్టుకున్న జాతీయ నాయకులు రాజీనామా కూడా చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కూడా త్వరలోనే విద్యార్థుల ఆగ్రహానికి గురవుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రమైనా విద్యార్థులపై ప్రేమ ఉంటే తక్షణమే జీవో 97 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రయ్యకు జీవో 97 రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో BRSV మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.