మీ ప్రాణాలు కాపాడుకోండి
-ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హాట్ కామెంట్స్
ప్ర
-ప్రత్యర్థులకు తీవ్ర హెచ్చరిక
నేను “సహనం పాటిస్తున్నా.. సహనం పాటించేంతవరకే. లేదంటే ఎవరి ప్రాణాలు వాళ్లు కాపాడుకుంటే మంచిద” ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హెచ్చరించారు.సొంత పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన రాజకీయ ప్రస్థానాన్ని తక్కువ అంచనా వేయవద్దంటూ ఘాటు హెచ్చరికలు చేశారు. అయన పరోక్షంగా మంత్రి వివేక్ ను ఉద్దేశించి మాట్లాడారు. తాను ప్రస్తుతం సహనం పాటిస్తున్నానని, అయితే ఆ సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని స్పష్టం చేశారు.
“ఈ గడ్డ నాది.. కాంగ్రెస్ అడ్డ” అంటూ వ్యాఖ్యానించిన ప్రేమ్ సాగర్ రావు, తాను బ్రీఫ్‌కేసులు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదన్నారు. చిల్లర వ్యక్తులకు, వారి రాజకీయాలకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు.
తాను ఇప్పటివరకు కొందరి చర్యలను సీరియస్‌గా తీసుకోవడం లేదని, అయితే చిల్లర వ్యక్తులకు మద్దతుగా నిలుస్తున్న వారికి కూడా హెచ్చరిక ఉందన్నారు. తాను సీరియస్‌గా తీసుకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ ప్రాంతానికే చెందిన వ్యక్తినని, ఈ గడ్డకు ఉన్న రుణాన్ని తీర్చుకుంటానని ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. యువతను తప్పుదోవ పట్టించే గంజాయి బ్యాచ్‌లను, మద్యం అలవాటు చేసే వారిని తాను సహించబోనని స్పష్టం చేశారు.
రౌడీయిజం, గూండాయిజం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తనకు రౌడీయిజం కొత్త కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొంతమంది కొత్త వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
“చిల్లర బ్యాచ్‌లకు.. నేను ఎవరికీ భయపడను. ముగ్గురు, నలుగురు పోయినంత మాత్రాన నాకేమీ కాదు.. నా దగ్గర పెద్ద చీమల పుట్టనే ఉంది” అంటూ ప్రత్యర్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, తాను ప్రస్తుతం సహనం పాటిస్తున్నానని, అయితే అది ఎప్పటికీ కొనసాగదని హెచ్చరించారు. అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంచిర్యాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.