కేటీఆర్‌కు తప్పిన ప్రమాదం

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. కరీంనగర్‌కు వెళ్తున్న సమయంలో అలుగునూరు చౌరస్తా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కేటీఆర్‌ ప్రయాణిస్తున్న కారు వెనుక డోర్‌ను లారీ ఢీకొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. అయితే కేటీఆర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

కరీంనగర్‌లో నిర్వహించిన విద్యార్థి, యువజన సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్‌ శనివారం బయలుదేరారు. మార్గమధ్యలో అలుగునూరు చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆధ్వర్యంలో భారీ క్రేన్‌తో గజమాల వేసి కేటీఆర్‌ను సన్మానించారు. అనంతరం మహిళలు ఆయనకు రాఖీలు కట్టారు. ఈ సమయంలో కేటీఆర్‌ కారు వెనుక డోర్‌ను తెరుస్తుండగా.. పక్క నుంచి వెళ్తున్న లారీ వేగంగా వచ్చి డోర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు డోర్‌ స్వల్పంగా దెబ్బతింది. ఒక్కసారిగా ఘటన చోటుచేసుకోవడంతో అక్కడున్న కార్యకర్తలు అప్రమత్తమయ్యారు.

అయితే కేటీఆర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగినప్పటికీ కేటీఆర్‌ తన పర్యటనను కొనసాగించారు. అనంతరం కాన్వాయ్‌తో కరీంనగర్‌కు బయలుదేరారు. యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు.

కేటీఆర్‌ ప్రయాణంలో ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జులైలో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ వద్ద ఆయన కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఆ ఘటనలో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుకు గాయాలయ్యాయి. ప్రస్తుత ఘటనలో కేటీఆర్‌ సురక్షితంగా బయటపడటంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

You might also like