నాది బీఆర్ఎస్ పార్టీనే, కాంగ్రెస్ కాదు…

నాది బీఆర్ఎస్ పార్టీనే, కాంగ్రెస్ కాదు… ఈ మాటలు అన్నది ఎవరో కాదు… నిన్నా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ లో చేరినట్టు చెబుతున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. . మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల వ్యూహం, అనుసరించాల్సిన విధానాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. అయన ఈ సమావేశానికి రావడం సంచలనంగా మారింది.

ఆయన ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ డైరెక్షన్ కోసం ఫామహౌస్ వచ్చామన్నారు.

పార్టీ పిలుపునిచ్చింది కాబట్టి ఈ సమావేశానికి హాజరవుతున్నాం. కేసీఆర్ ఈరోజు ఏ దిశానిర్దేశం చేస్తారో దాని ప్రకారం నడుచుకుంటాం. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడినే, అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ సభ్యుల వైపే కూర్చుంటాను’ అని మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై కోర్టు తీర్పు కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

You might also like