కంది శ్రీనివాస్‌కు మళ్లీ నోటీసులు
ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్‌రెడ్డికి క్రమశిక్షణ కమిటీ మళ్లీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయనకు గతంలోనే ఒక నోటీసు జారీ చేయగా, ఇప్పుడు మరో నోటీసు జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉట్నూర్‌లో కొద్ది రోజుల కిందట జరిగిన జిల్లా పీఏసీ సమావేశంలో చోటుచేసుకున్న వివాదంపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. సమావేశంలో సీనియర్ నేత సంజీవరెడ్డిపై ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్‌రెడ్డి బూతులతో రెచ్చిపోయారు. అసభ్య, అనుచిత పదజాలం ఉపయోగించారన్న ఆరోపణలపై క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే శ్రీనివాస్‌రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని, గతంలో నోటీసులు జారీ చేసిన క్రమశిక్షణ కమిటీ…. ఇప్పుడు తాజాగా మరో నోటీసు ఇవ్వడమే కాకుండా, పది రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆయన సమాధానాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.
ఇప్పటికే ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు బహిరంగంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా షోకాజ్ నోటీసులు జారీ కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలపై అధిష్టానం క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతుండటం స్థానిక కాంగ్రెస్ రాజకీయాల్లో మరింత వేడి పెంచింది. పది రోజుల్లో నేతలు ఇచ్చే వివరణపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నోటీసు సారాంశం ఇదే…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) కి చెందిన క్రమశిక్షణా కార్యాచరణ కమిటీ (DAC), మీ క్రమశిక్షణా రాహిత్యంపై పలువురు పార్టీ కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యంగా, ఇటీవల జరిగిన PAC సమావేశంలో మీరు గందరగోళం సృష్టించారని, తద్వారా పార్టీకి ఇబ్బంది కలిగించారని, పార్టీ క్రమశిక్షణ… ప్రతిష్ట దెబ్బతీశారని ఆరోపణలు వచ్చాయి. పై ఆరోపణల దృష్ట్యా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు, పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు మీపై ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవద్దో కారణం చూపాలని ఈ నోటీసు ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. ఈ నోటీసు అందిన తేదీ నుంచి పది (10) రోజులలోపు మీ సవివరమైన లిఖితపూర్వక వివరణను సమర్పించాలని మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. నిర్ణీత సమయంలోగా ఎలాంటి సంతృప్తికరమైన వివరణ రాకపోతే, భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగం, నియమాలు… క్రమశిక్షణా విధివిధానాలకు అనుగుణంగా, తదుపరి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే క్రమశిక్షణా కార్యాచరణ కమిటీ (DAC) తదుపరి చర్యలు తీసుకోక తప్పదని దయచేసి గమనించండి.