అసెంబ్లీ సమావేశాల వేళ ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పోలీసుల తీరుపై కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో అసెంబ్లీకి హాజరవుతున్నారు. ఇందులో భాగంగా సునీతా లక్ష్మారెడ్డి నల్ల చీర ధరించి అసెంబ్లీకి బయలుదేరారు. అయితే, ఈ సంద‌ర్భంగా పోలీసుల తీరుపై సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముందు ఆమె కంటతడి పెట్టుకున్నారు. మహిళా ఎమ్మెల్యేతో ఇలాగేనా వ్యవహరించేదని పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్‌ నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమెను సబితా ఇంద్రారెడ్డి ఓదార్చారు.

మరోవైపు బ్లాక్ టీషర్టులు ధరించి వచ్చిన హరీశ్‌రావు, అనిల్ జాదవ్‌ను పోలీసులు అసెంబ్లీ ఎదుట అడ్డుకున్నారు. బ్లాక్ టీషర్టులతో లోపలికి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో హరీశ్‌రావు టీషర్ట్ విప్పి బనియన్‌పై నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. ఆయన్ను మెయిన్ గేటు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న సమయంలో తోపులాట జరిగింది. దీంతో జగదీశ్ రెడ్డి కాలికి గాయమైంది. ఈ ఘటనతో అసెంబ్లీ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

You might also like