సింగరేణిలో ‘మారుపేర్ల’​బాధితులు 128 మంది మాత్రమే…

సింగరేణి లో మారుపేర్ల బాధితులు కేవలం 128 మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు శాసనమండలిలో ఒక ప్రకటన చేశారు.

​సంఖ్య పరంగా ఇది చిన్నదే అయినా, భవిష్యత్తులో నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతో అధికారులు దీనిపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ‘మారుపేర్ల’ (ప్రాక్సీ కార్మికుల) సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకవైపు అధికారుల ఆందోళనలు, మరోవైపు సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల నేపథ్యంలో.. అధికారులపై ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా కమిటీని నియమించినట్లు తెలిపారు. చాలా కాలంగా సంస్థకు సేవలందిస్తున్న ఆ 128 మంది కార్మికులకు కమిటీ నివేదిక అందిన వెంటనే శాశ్వత న్యాయం చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

ఈ అంశంపై అధ్యయనం చేసి తగిన పరిష్కారాలు చూపేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ​అధికారిక రికార్డుల్లో ఒకరి పేరు ఉండగా, వారి స్థానంలో వేరొకరు విధులు నిర్వర్తించే ఈ సమస్య ఇటీవల వచ్చింది కాదని, 1997 నుంచే కొనసాగుతోందని డిప్యూటీ సీఎం వివరించారు.
​చట్టప్రకారం ఒకరి పేరుతో మరొకరు పనిచేయడం తీవ్రమైన నేరమైనా, కార్మికుల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని గతంలోనూ మానవీయ కోణంలో పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయన్నారు. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో అప్పట్లో 45 మంది అధికారులతో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారని గుర్తుచేశారు.

You might also like