ఉమ్మడి ఆదిలాబాద్ లో విస్తారంగా వర్షాలు
-నిన్న రాత్రి నుంచి పలు చోట్ల మోస్తరు వానలు
-వాంకిడిలో అత్యధికంగా 34.8 మి.మీ వర్షపాతం నమోదు
దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోన్న నేపథ్యంలో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇక, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. నిన్న రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడుతున్నాయి. పలు మండలాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొద్ది రోజులుగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు ఈ వానలు ఊపిరిపోశాయి. పలు నియోజకవర్గాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 34.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అలాగే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌లో 25 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా మావల మండలం రామ్‌నగర్‌లో 22.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అటు నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తుండగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.