అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తొలగింపు
అక్రమాలకు పాల్పడిన ఓ అంగన్వాడీ టీచర్ ను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. మంచిర్యాల జిల్లా . కోటపల్లి మండలం నక్కలపల్లి 1 అంగన్వాడీ టీచర్ సరోజన ను విధుల్లో తొలగించారు.
కొద్ది రోజుల కిందట ఈ సెంటర్ లో ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి. పెండ్లి కాని యువతికి పెండ్లి అయినట్లు… ఆమె గర్భవతి అయినట్లు, డెలివరీ సైతం అయినట్లు రికార్డుల్లోకి ఎక్కించారు. ఇక బీటెక్ విద్యార్థి వయస్సు రెండు సంవత్సరాలుగా చూపించారు. పక్కనే ఉన్న బద్దంపల్లి సెంటర్ కు చెందిన ఓ మహిళకు సైతం పెండ్లి కాకున్నా, వాళ్ల చెల్లి కూతురుని పెండ్లి కాని మహిళ కూతురుగా చూపించారు. ఇందులో ఫొటోలో తల్లిది ఉండగా, తల్లి పేరు మాత్రం మార్చేశారు. పాలిక అంజలి అనే గృహిణికి ఇద్దరు పిల్లలు కాగా, అందులో అతని కొడుకు పేరుతో సరుకులు అందిస్తున్నట్లు నమోదు చేసుకున్నట్లు చెబుతున్నా వారికి ఇప్పటి వరకు ఏం అందలేదు. ఇలా లబ్ధిదారుల పేరిట సరుకులు మొత్తం మాయం చేస్తున్నారు.
ఇక రెండు రోజుల కిందట మంచిర్యాల సీడీపీవో, సూపర్వైజర్ కలిసి గ్రామస్థుల సమక్షంలో విచారణ నిర్వహించారు. అందులో లబ్ధిదారుల పేర్లు చదువుతుండగా అందులో పెద్ద ఎత్తున నకిలీ లబ్ధిదారులుగ తేలింది. గతంలోనూ ఈ సెంటర్ నుంచి పాలు, గుడ్లు మాయమైన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను విధుల్లో నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.