భీమిని మండలంలో ఏసీబీ కలకలం.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీపీవో

మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో ACB అధికారుల దాడి స్థానికంగా సంచలనం సృష్టించింది. సాదాబైనామా పట్టా చేయడానికి లంచం డిమాండ్ చేసిన జీపీవో (GPO) ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.

పెద్దంపేట గ్రామానికి చెందిన మహమ్మద్ ఫకీర్ అనే రైతుకు సంబంధించిన సాదాబైనామా పట్టా మార్పిడి చేయించేందుకు జీపీవో దుర్గాప్రసాద్ బాధితుడిని లంచం కోరారు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచన మేరకు పథకం ప్రకారంగా మంగ‌ళ‌వారం వ్యవహారం నడిచింది. మహమ్మద్ ఫకీర్ నుంచి రూ. 80,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలోని సిబ్బంది దాడి చేసి దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

బ‌య‌ట లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుకుని అత‌న్ని కార్యాల‌యానికి త‌ర‌లించారు. జీపీవో వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు, ప్రభుత్వ విధుల్లో అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.

You might also like