రిమ్స్ సందర్శించిన మంత్రి రాజనర్సింహ
ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఎస్ఎన్సీయూ వార్డును సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నాం ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుని రిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి దామోదర రాజనర్సింహ ప్రమాదం జరిగిన ఎస్ఎన్సీయూ (SNCU – నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం) వార్డును పరిశీలించారు. ఏసీ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించిన తీరును, వార్డులో దట్టమైన పొగ కమ్ముకున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
మంత్రి పర్యటన సందర్భంగా రిమ్స్ ఆసుపత్రి ప్రధాన ద్వారం మూసివేశారు. మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకపోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అయితే, “రివ్యూ తర్వాత వివరాలు వెల్లడిస్తాన”ని మంత్రి స్పష్టం చేస్తూ నేరుగా సమీక్ష సమావేశానికి వెళ్లిపోయారు.
రిమ్స్ ఆసుపత్రి సమావేశ మందిరంలో రిమ్స్ సిబ్బంది, వైద్యులు మరియు జిల్లా అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. అగ్నిప్రమాద ఘటన ఎలా జరిగింది? భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై అధికారులను ఆరా తీశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు, ఆసుపత్రిలో భద్రతా ప్రమాణాల మెరుగుదలపై పూర్తి స్థాయిలో చర్చిస్తున్నారు.