తెలంగాణలో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గంటకు 30 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు ఎనిమిది జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచనలున్నాయని తెలిపింది. ఇవాళ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు అతి భారీ వర్ష సూచనలున్నాయని చెప్పింది.

-ఇవాళ (సెప్టెంబర్ 22) ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహూబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.

-సెప్టెంబర్ 23న ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.

-సెప్టెంబర్ 24న ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు.

-ఇక సెప్టెంబర్ 25, 26వ తేదీల్లోనూ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక సెప్టెంబర్ 28 వరకు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్ల‌డించారు.

భారీ వర్షాల కారణంగా రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ ఆటంకాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని… రైలు మరియు రోడ్డు ప్రయాణాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

 

You might also like