నియామకాలు ర‌ద్దు.. సంబురాలు బంద్‌…

-ఎస్సీ సెల్ నియామకాలపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ బ్రేక్!
-పదవులు వచ్చాయని సంబరాలు చేసుకున్నవారికి షాక్..
-నిలిచిపోయిన నియామకాలు
-దసరా తర్వాతే ఫైనల్ లిస్ట్..

“నిన్నటి దాకా పూలమాలలు.. సోషల్ మీడియాలో హోరెత్తిన సంబరాలు.. కానీ, ఒక్క ప్రకటనతో సీన్ మొత్తం రివర్స్ అయింది! జిల్లా అధ్యక్షుడు ఒకరికి పదవులు ఇస్తే.. ఎమ్మెల్యే రాత్రికి రాత్రే వాటికి బ్రేకులు వేశారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అసలు ఎస్సీ సెల్ నియామకాల రచ్చ ఏంటి…? నిన్నటి దాకా గాల్లో తేలిపోయిన నేతలు.. ఇప్పుడు ఎందుకు ఢీలా పడ్డారు…? మంచిర్యాల కాంగ్రెస్ లో రాజుకున్న వర్గపోరుపై ‘నాంది న్యూస్’ స్పెషల్ రిపోర్ట్…

కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యానికి అద్దం ప‌ట్టే వ్య‌వ‌హారానికి సంబంధించిన అంశ‌మిది… మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సెల్ నియామకాలు అగ్గి రాజేశాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఇటీవలే ఎస్సీ సెల్‌కు సంబంధించి నూతన కమిటీలను ప్రకటించారు. దీంతో పదవులు దక్కిన నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హోరెత్తించారు. వారి అనుచరులైతే శాలువాలు, పూలమాలలతో ఘనంగా సంబరాలు కూడా చేసుకున్నారు. అంతా సాఫీగా సాగిపోతోందని అనుకుంటున్న తరుణంలో… సీన్ రివర్స్ అయింది. ఈ నియామకాలపై బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అనుచరవర్గం సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసి బాంబు పేల్చింది. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రకటించిన ఎస్సీ సెల్ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

అయితే ఈ రగడ వెనుక అసలు కారణం వేరే ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ సిఫార్సు చేసిన జాబితాను పక్కనపెట్టి, ఆయనకు గిట్టని వారికి, వేరే వారికి పదవులు కట్టబెట్టడం వల్లే ఆయన సీరియస్ అయ్యారని.. అందుకే తన పవర్ ఏంటో చూపిస్తూ నియామకాలను ఆపించారని కాంగ్రెస్ నేతలే స్వయంగా చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతానికి ఈ నియామకాలను నిలిపివేసినట్లు ప్రకటించిన ఎమ్మెల్యే వర్గం… దసరా పండుగ తర్వాత నాయకులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది.

నిజానికి మంచిర్యాల కాంగ్రెస్ లో ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో మండల అధ్యక్షుల నియామకం విషయంలోనూ వివాదం చెలరేగింది. ఇప్పుడు ఎస్సీ సెల్ వంతు వచ్చింది. ఏది ఏమైనా… పదవులు వచ్చాయని గాల్లో తేలిపోయిన నేతలు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డ్డారు.. మ‌రోవైపు, పదవులు రాక అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే వర్గం మాత్రం లోలోపల సంతోషం వ్యక్తం చేస్తోంది. దసరా తర్వాత ఎమ్మెల్యే మార్క్ జాబితా బయటకు వస్తుందా? లేక మళ్లీ పాత జాబితానే ఫైనల్ అవుతుందా? వేచి చూడాలి.

 

 

 

You might also like