”కాక్‌పిట్‌లోనూ హనుమాన్ చాలీసా జపించా”
కాక్‌పిట్‌లో తాను హనుమాన్ చాలీసా జపించానని భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ వెల్లడించారు. ఆయనతో ప్రధానమంత్రి మోదీ వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా స్మిత్ మోదీ పలు విషయాలను వెల్లడించారు. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు తాను హనుమాన్ చాలీసా పఠిస్తానని స్మిత్ తెలిపారు. కాక్‌పిట్‌లో దాడి జరిగిన సమయంలోనూ అదే చేశానని చెప్పారు. తీవ్రంగా గాయపడినా తన గాయాల గురించి ఆలోచించలేదని, విమానంలోని ఎవరికీ ప్రాణహాని కలగకూడదని మాత్రమే ప్రార్థించానని వివరించారు. తాను లేచి పరిస్థితిని అదుపులోకి తీసుకోకపోతే విమానంలో ఉన్న వారందరి ప్రాణాలకూ ప్రమాదం ఏర్పడుతుందని అర్థం చేసుకున్నానని స్మిత్ చెప్పారు. అందుకే గాయాల నొప్పిని పక్కనపెట్టి కాక్‌పిట్ తలుపు తెరిచేందుకు ప్రయత్నించినట్లు వివరించారు.
భావోద్వేగానికి గురైన స్మిత్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు స్వయంగా ఫోన్ చేసి ధైర్యం చెప్పడంపై కెప్టెన్ స్మిత్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీనే తనకు అత్యంత గొప్ప ఆరాధ్య వ్యక్తి అని, ఆ క్షణంలో చావుకు దగ్గరగా వెళ్లిన తాను మళ్లీ మీతో ఇలా మాట్లాడతానని కలలో కూడా ఊహించలేదని మోదీతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు…
కాక్‌పిట్‌లో తీవ్రంగా గాయపడినా విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడేందుకు స్మిత్ చేసిన ప్రయత్నాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్మిత్‌ను ‘నిజమైన హీరో’గా అభివర్ణించారు. ఆయన చర్యల వల్ల 174 మంది ప్రాణాలు కాపాడబడ్డాయని పేర్కొన్నారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ అధికారులు విమానాన్ని కూల్చే ప్రయత్నంగా అనుమానిస్తున్నారు. అయితే దాడి వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఫ్లైదుబాయ్ కూడా దర్యాప్తు పూర్తయ్యే వరకు ఊహాగానాలకు దూరంగా ఉండాలని కోరింది.