“మీరు యావత్ ప్రపంచానికే హీరో”
వేల అడుగుల ఎత్తులో విమానం.. కాక్‌పిట్‌లో ఊహించని దాడి.. కళ్ల ముందు చీకట్లు కమ్ముకున్నా వెనక్కి తగ్గని ధైర్యం.. ప్రాణాలు పోతాయని తెలిసినా చివరి ప్రయత్నంగా కాక్‌పిట్ తలుపు తెరిచి 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ సాహసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆయన ధైర్యానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫిదా అయ్యారు. స్వయంగా ఫోన్ చేసి కెప్టెన్ స్మిత్‌ను అభినందించారు.
“మీరు భారతదేశానికే కాదు.. యావత్ ప్రపంచానికే హీరో”
సెప్టెంబర్ 30న జరిగిన ఫ్లై దుబయ్ విమాన ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన అసాధారణ ధైర్యాన్ని నెతన్యాహు ప్రశంసించారు. స్మిత్‌ను “భారతదేశానికి, ఇజ్రాయెల్‌కే కాదు… మీరు యావత్ ప్రపంచానికి నిజమైన హీరో”గా అభివర్ణించారు. తన రాబోయే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కెప్టెన్ స్మిత్‌తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇజ్రాయెల్‌కు ఆహ్వానిస్తున్నట్లు నెతన్యాహు తెలిపారు. ప్రత్యేక జ్యోతిని వెలిగించే గౌరవాన్ని వారిద్దరికీ అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
సాధారణ ప్రయాణమే అనుకున్నా.. కాక్‌పిట్‌లో ఒక్కసారిగా దాడి
తనకు అదొక సాధారణ ప్రయాణంగానే అనిపించిందని కెప్టెన్ స్మిత్ తెలిపారు. అయితే కొద్దిసేపటి తర్వాత కో-పైలట్ ప్రార్థన చేసుకోవాలని కోరారని చెప్పారు. కో-పైలట్ ప్రార్థన చేస్తుండగా తాను గౌరవంతో ముందుకు చూస్తూ ఉన్నానని.. మూడు, నాలుగు నిమిషాల తర్వాత తన తల వెనుక భాగంలో ఒక్కసారిగా గట్టి దెబ్బ తగిలినట్లు అనిపించిందని స్మిత్ వివరించారు మొదట విమానానికి ఏదైనా సమస్య వచ్చిందని భావించినా.. దాడి కొనసాగడంతో అసలు విషయం అర్థమైందన్నారు. కాక్‌పిట్‌లో ఉన్న వ్యక్తే తనపై దాడి చేస్తున్నాడని గ్రహించినట్లు చెప్పారు. దాడి కారణంగా తీవ్రంగా గాయపడ్డ స్మిత్‌కు దాదాపు ఏమీ కనిపించలేదు. తన చూపు పూర్తిగా మసకబారిందని ఆయన చెప్పారు. అదే సమయంలో విమానం వేగంగా కిందకు పడిపోతోందని అర్థమైందన్నారు.
“నేను ఆ పని చేయకపోతే చనిపోతానని అర్థమైంది”
కాక్‌పిట్ తలుపు తెరవడానికి ప్రయత్నించినా అది లోపలి నుంచి లాక్ అయి ఉందని స్మిత్ తెలిపారు. అనంతరం కాక్‌పిట్ నేలపై పడిపోయినట్లు చెప్పారు. విమానం తీవ్రంగా ఊగిపోతుండటం, హోరున గాలి వీస్తుండటం, ప్రయాణికుల అరుపులు వినిపించాయని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే తనలో ఇంకా కొంత శక్తి మిగిలి ఉందని గుర్తించిన స్మిత్.. చివరి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. “నా శక్తినంతా కూడగట్టుకుని తలుపు దగ్గరకు వెళ్లా. దాన్ని తెరిచా. నేను ఆ పని చేయకపోతే చనిపోతానని నాకు అర్థమైంది” అని స్మిత్ తెలిపారు.
నాబ్ తిప్పి.. కాక్‌పిట్ తలుపు తెరిచిన పైలట్
కాక్‌పిట్ తలుపును బయట నుంచి కోడ్ ద్వారా తెరవడానికి సహచరులు ప్రయత్నించినా.. కో-పైలట్ తలుపు తెరుచుకోకుండా అడ్డుకున్నారని స్మిత్ చెప్పారు. లోపలి నుంచి తలుపు తెరవడానికి నాబ్‌ను తిప్పాల్సి ఉంటుందని.. తన చేయి నాబ్ వరకు చేరగానే దాన్ని వేగంగా తిప్పి తలుపు తెరిచానని వివరించారు. తలుపు తెరుచుకున్న వెంటనే అక్కడ ఉన్న ప్రయాణికులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అలా 174 మంది ప్రాణాలకు పెను ప్రమాదం తప్పింది.
“మీరు ప్రాణాలకంటే గొప్పదాన్ని కాపాడారు”
కెప్టెన్ స్మిత్ అనుభవాలను విన్న నెతన్యాహు ఆయనను మరింతగా ప్రశంసించారు. “మీరు ఎన్నో ప్రాణాలను కాపాడారు. అంతకంటే గొప్పదాన్ని కూడా కాపాడారని నేను భావిస్తున్నాను. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనా ధైర్యవంతులైన పైలట్లు, ప్రయాణికులు ఎలాంటి చెడునైనా ఎదుర్కొని ఓడించగలరనే ప్రపంచ విశ్వాసాన్ని మీరు కాపాడారు” అని నెతన్యాహు అన్నారు. స్మిత్‌ను ఇజ్రాయెల్ హీరోగా, భారతదేశపు హీరోగా, యావత్ ప్రపంచ హీరోగా అభివర్ణించారు.
ఇజ్రాయెల్‌కు ప్రత్యేక ఆహ్వానం
కెప్టెన్ స్మిత్‌తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇజ్రాయెల్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నెతన్యాహు ఆహ్వానించారు. ప్రత్యేక జ్యోతిని వారిద్దరితో వెలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సాధారణంగా ఈ గౌరవం ఇజ్రాయెల్ పౌరులకు మాత్రమే అందిస్తామని.. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో స్మిత్‌ను ఇజ్రాయెల్ ప్రజలంతా సాదరంగా స్వాగతిస్తారని చెప్పారు. “మిమ్మల్ని త్వరలోనే ఇజ్రాయెల్‌లో చూడాలని కోరుకుంటున్నా” అంటూ నెతన్యాహు తన ఫోన్ సంభాషణను ముగించారు.