కో-పైలట్ గతం… సంచలనం
ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం.. కాక్‌పిట్‌లోనే పైలట్ల మధ్య అకస్మాత్తుగా ఘర్షణ.. ఓ పైలట్‌పై కత్తితో దాడి.. ఆ వెంటనే విమానం వేగంగా కిందికి దూసుకెళ్లడం.. క్షణాల్లో 174 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి. భారత సంతతికి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన అసాధారణ ధైర్యం, ప్రయాణికులు–సిబ్బంది అప్రమత్తత, మరో ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్ల చొరవతో పెను విమాన ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కో పైలెట్ కు సంబంధించిన పలు సంచలన అంశాలు బయటకు వచ్చాయి…
ఎవరీ సహ పైలట్..?
ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న కో పైలెట్ హమామ్ అల్-హమ్మామీగా గుర్తించారు. అతని తండ్రి ఒమన్‌కు చెందిన వాడు కాగా, తల్లి సిరియాకు చెందిన వారని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. హమామ్ అల్-హమ్మామీ గతంలో ఒమన్ ఎయిర్‌లో పనిచేశాడు. అక్కడ పైలట్ శిక్షణ పొందుతున్న సమయంలో అతడి ఆన్లైన్ కార్యకలాపాలపై భద్రతా సంస్థలకు అనుమానాలు ఏర్పడ్డాయి. దీంతో అతడిని విమానాలు నడిపే విధుల నుంచి తప్పించి కార్యాలయ విధులకు మార్చారు. అతను 2024 ప్రాంతంలో ఒమన్ ఎయిర్‌ను విడిచిపెట్టి… రాయల్ ఎయిర్ మొరాకోలో పనిచేశాడు.
తీవ్రవాద భావజాలంపై దర్యాప్తు..
అతడికి అల్‌ఖైదా భావజాలంతో సంబంధం ఉన్నాయని, ఆన్లైన్లో తీవ్రవాద సంబంధిత కంటెంట్ చూసినట్లు ఆరోపణలు ఉన్నాయని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అతని లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై కూడా దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. కొన్ని పోస్టుల్లో ఇజ్రాయెల్‌కు సంబంధించిన విమానాల దృశ్యాలు, తీవ్రవాద నేతల చిత్రాలు ఉన్నాయి. అయితే, ఫ్లై దుబాయ్‌లోకి ఎలా వచ్చాడనేది ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్నగా మారింది. ఒక వ్యక్తిపై గతంలోనే భద్రతాపరమైన అనుమానాలు ఉన్నాయన్న నివేదికలు నిజమైతే.. ఆ సమాచారం అంతర్జాతీయ విమానయాన సంస్థల భద్రతా వ్యవస్థలకు చేరిందా? చేరితే ఫ్లై దుబాయ్ నియామక ప్రక్రియలో అది ఎలా పరిగణనలోకి రాలేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చివరి క్షణంలో తప్పిన పెను విషాదం
కాక్‌పిట్‌లో కో పైలట్ తనపై దాడి చేసినప్పటికీ గాయాలతో ఉన్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరవడం, ప్రయాణికులు–సిబ్బంది వెంటనే స్పందించడం, ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు విమానాన్ని తిరిగి నియంత్రణలోకి తీసుకోవడం.. ఇవన్నీ కలిసి 174 మంది ప్రాణాలను కాపాడిన కీలక పరిణామాలుగా నిలిచాయి. ఆకాశంలో కేవలం కొన్ని క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటన.. ఒక ప్రయాణికుల విమానం ఎంత సులభంగా పెను విషాదానికి వేదికగా మారగలదో ప్రపంచానికి మరోసారి గుర్తు చేసింది.