తెలంగాణలో హఠాత్తుగా మారిన వాతావరణం.. రెండురోజులు భారీ వర్ష సూచన..

తెలంగాణలో వాతావరణం అకస్మాత్తుగా మారుతోంది. కొద్ది రోజులుగా భానుడి ప్రతాపంతో పాటు స్థానిక వాతావరణ మార్పుల కారణంగా రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వేగవంతమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉన్నందున వర్షం సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని, చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు.

వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుందని నివేదిక పేర్కొంది. అయితే కొన్ని చోట్ల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై తేలికపాటి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. పిడుగులు పడే ముప్పు ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు సురక్షితమైన కాంక్రీట్ భవనాల నీడలోకి వెళ్లాలని అధికారులు కోరారు.

You might also like