మంచిర్యాల ఆసుపత్రిలో పేలిన ఏసీ.. తప్పిన ప్రాణనష్టం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు, పొగలు ఎగిసిపడ్డాయి. డయాలసిస్ రూమ్‌ బయట ఏర్పాటు చేసిన ఏసీ ఒక్కసారిగా పేలడంతో ఆసుపత్రిలో కలకలం రేగింది.

ప్రమాదం జరిగిన సమయంలో డయాలసిస్ విభాగం వద్ద ఇద్దరు రోగులు ఉన్నారు. ఏసీ పేలిన వెంటనే భారీగా పొగలు, మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ప్రమాదంలో డయాలసిస్ మెషిన్లు ధ్వంసమాయ్యాయి. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రాణనష్టం తప్పింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఏసీ పేలడానికి గల కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నారు.

ఆసుపత్రిలో ఏసీ పేలుడు ఘటనతో రోగులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

You might also like