ఏసీబీ వలలో ఇద్దరు అధికారిణులు
అవినీతిలో మగవారితో పాటు తామేమీ తీసిపోలేదని నిరూపిస్తున్నారు అధికారిణులు… ఒకే రోజు ఇద్దరు అవినీతి అధికారిణులు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్టారు. వీరిలో ఒకరు రంగారెడ్డి జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వో కాగా, మరొకరు జీహెచ్‌ఎంసీలో టౌన్‌ప్లానింగ్ అధికారి. రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఒక ఫిజియోథెరపీ సెంటర్ నిర్వాహకుడి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటున్న డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ స్వర్ణకుమారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆమెతోపాటు హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఎం శ్రీనివాస్, అతడి ప్రైవేట్ డ్రైవర్ మద్దూరి కృష్ణయ్యను అరెస్టు చేశారు. మరో ఘటనలో మెహిదీపట్నం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సునీత సోమవారం ఖైరతాబాద్ జోన్ కార్యాలయం బయట లంచం తీసుకొని, తన కారులో పెట్టిస్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు సునీత రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రూ.6.5 లక్షలు స్వాధీనం చేసుకొని ఆమెను అరెస్ట్ చేశారు.
ఫిజియోథెరపీ కేంద్రం విషయంలో…
ఎల్‌బీనగర్‌లో అనుమతి లేకుండా నడుపుతున్న ఓ ఫిజియోథెరపీ కేంద్రంపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, కొత్త లైసెన్స్ జారీ చేసేందుకు డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి రూ.2లక్షల మేర లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఇచ్చేందుకు అంగీకరించి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి నుంచి రూ.లక్ష తీసుకున్న హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ డబ్బులు ముట్టాయని డీఎంహెచ్‌వోకు ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత ఫిజియోథెరఫీ కేంద్రాన్ని తెరవడానికి రూ. 3,500తో డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకురమ్మని పంపారు. లంచంగా తీసుకున్న మొత్తాన్ని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్న మద్దురి క్రిష్ణయ్యకు ఇచ్చారు. లంచం డబ్బును కారులో పెట్టేందుకు క్రిష్ణయ్య తీసుకెళ్తుండగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ బృందం పట్టుకుంది. పెద్దఅంబర్‌పేట్ పరిధిలోని న్యూ లైఫ్ విల్లాలో ఉన్న స్వర్ణకుమారి నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం డీఎంహెచ్‌ఓతో పాటు హెల్త్ ఇన్‌స్పెక్టర్, ప్రైవేటు డ్రైవర్‌లను నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు..
మెహిదీపట్నం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న సునీత డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణ అనుమతులకు రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైరతాబాద్ జోన్ కార్యాలయం బయట రూ.4లక్షలు లంచం తీసుకున్న సునీత ఆ మొత్తాన్ని తన కారులో పెట్టిస్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచం కాకుండా అదనంగా లెక్కల్లో చూపని రూ.2.50 లక్షల నగదును కూడా అధికారులు గుర్తించారు. మొత్తం రూ.6.5 లక్షలు స్వాధీనం చేసుకొని, సునీతను ఆరెస్టు చేశారు. ఆమె నివాసంలో డీఎస్పీ మాజిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.