న‌న్ను, నా భార్య‌ను వేధిస్తున్న‌రు

సర్వసభ్య సమావేశంలో ద‌ళిత స‌ర్పంచ్ ఆందోళ‌న‌

తాండూర్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. అధికారుల తీరుకు నిరసనగా మాదారం సర్పంచ్ లక్ష్మణ్ సభలో నేలపై కూర్చొని ఆందోళనకు దిగారు. తనను, అంగన్ వాడీ టీచర్ గా పనిచేస్తున్న తన భార్యను ఐసీడీఎస్ అధికారులు ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం తాండూర్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక అధికారి అంజయ్య ఆధ్వర్యంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. అయితే సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే మాదారం సర్పంచ్ లక్ష్మణ్ కింద కూర్చుని నిరసన తెలపడం అందరినీ విస్మయానికి గురిచేసింది. తాను సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామ పరిధిలోని అంగన్ వాడీ కేంద్రాలను తనిఖీ చేసి, సిబ్బందిని సరిగ్గా పనిచేయాలని తాను కోరాన‌ని అన్నారు. అదే నేరమా…? అని ప్రశ్నించారు.

దీనిని మనసులో పెట్టుకున్న కొందరు సిబ్బంది.. కక్షపూరితంగా తన భార్య పనిచేస్తున్న అంగన్ వాడీ కేంద్రంపై గుర్తుతెలియని వ్యక్తులతో తప్పుడు ఫిర్యాదులు చేయించారని ఆరోపించారు. ఈ నిరాధారమైన ఆరోపణలను సాకుగా చూపి సోమవారం మంచిర్యాల జిల్లా ఐసీడీఎస్ పీడీ, బెల్లంపల్లి సీడీపీఓ, స్థానిక సూపర్ వైజర్ కేంద్రానికి వచ్చి తన భార్యను మానసికంగా వేధించారని సర్పంచ్ మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక దళిత సర్పంచ్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. అధికారులపై చర్యలు తీసుకొని, తమకు న్యాయం జరిగే వరకు తాను ఎలాంటి సమావేశాలకు హాజరుకానని అధికారులకు చేతులెత్తి దండం పెట్టి సభ నుంచి వాకౌట్ చేశారు.

సర్పంచ్ లక్ష్మణ్ కు తోటి సర్పంచులు సైతం మద్దతుగా నిలిచారు. బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ వారు కూడా సభ నుంచి బయటకు వచ్చేశారు.

You might also like