కుటుంబ కలహాలతో భార్య, భర్త ఆత్మహత్యాయత్నం… భర్త మృతి
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ నిండు ప్రాణాన్ని బలిగొనగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. దండేపల్లి మండలం కాసిపేట గ్రామానికి చెందిన మడావి రాజ్ కుమార్, ఆయన భార్య వెన్నెల మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మనస్పర్థలు తారాస్థాయికి చేరడంతో భార్య వెన్నెల తీవ్ర మనస్థాపంతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
వెన్నెల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటాన్ని చూసి భర్త రాజ్ కుమార్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భార్య పట్ల ఉన్న బెంగ, ఆవేదనతో తను కూడా అదే క్రిమిసంహారక మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రాజ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి అప్రమత్తమై,అపస్మారక స్థితిలో ఉన్న భార్య వెన్నెలను మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆమెకు చికిత్స కొనసాగుతోంది. సమాచారం అందుకున్న దండేపల్లి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.