జంగల్ సఫారీ మారథాన్‌కు శ్రీకారం!

ప్రకృతి పరిరక్షణపై అవగాహన.. ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రోత్సాహం

అడవుల అందాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ.. ప్రకృతి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో మంచిర్యాల నియోజకవర్గంలో దేశీయ స్థాయి తొలి ఫారెస్ట్ సఫారీ మారథాన్‌కు శ్రీకారం చుట్టారు. తెలంగాణ అటవీ శాఖ, గ్రీన్‌సెక్యూర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏసీసీ క్వారీ సమీపంలోని జంగల్ సఫారీలో ఈ మారథాన్‌ను నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. 30 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించిన పరుగు పోటీలను ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరందు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, డైరెక్టర్ శాంత రామ్ జెండా ఊపి ప్రారంభించారు. వివిధ విభాగాల్లో పాల్గొన్న రన్నర్లు ఉత్సాహంగా పరుగులు తీశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన అటవీ శాఖ అధికారులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు అడవుల ప్రాధాన్యత ప్రజలకు తెలియ‌చేస్తుంద‌న్నారు. అంతేకాకుండా, ప్రకృతి పట్ల బాధ్యతను పెంపొందిస్తుంద‌న్నారు. అడవుల సహజ సౌందర్యాన్ని పరిచయం చేయడం, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత చాటిచెప్పడం, ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై ఆసక్తిని పెంపొందించడం ఈ మారథాన్ ప్రధాన ఉద్దేశమ‌న్నారు. ప్రకృతి ఒడిలో సాగిన ఈ పరుగు కార్యక్రమం అటవీ సంపద పరిరక్షణతో పాటు ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచేందుకు దోహదపడనుంది.

You might also like