కాంగ్రెస్ వ‌చ్చాకే కార్మికుల‌కు న్యాయం

సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చారిత్రాత్మక నిర్ణయాలపై ఐఎన్టీయూసీ (INTUC) హర్షం వ్యక్తం చేసింది. మందమరి ఏరియా కేకే-5 గని వద్ద జరిగిన గేట్ మీటింగ్‌లో ఐఎన్టీయూసీ నాయకులు కాంపెల్లి సమ్మయ్య, రాంశెట్టి నరేందర్ మాట్లాడారు. ఉత్పత్తి తగ్గినప్పటికీ 34% లాభాల వాటా ఇవ్వడం, కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5500 బోనస్, నెహ్రూ హౌసింగ్ కాలనీ ద్వారా సొంతింటి కలను నెరవేర్చడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. డిస్మిస్ కార్మికులకు మరో అవకాశం, ఏరియా ఆస్పత్రుల్లోనే మెడికల్ బోర్డు, పర్క్స్‌పై ఆదాయపు పన్ను మాఫీ, ఏరియా ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్, కొత్త క్వార్టర్ల నిర్మాణం, మారుపేర్ల సమస్య పరిష్కారానికి కమిటీ వంటి కీలక నిర్ణయాలను వారు స్వాగతించారు. ఈ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన డా. బి. జనక్ ప్రసాద్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీయూసీ (AITUC) కార్మికులకు ఒరగబెట్టిందేమీ లేదని, ప్రభుత్వ నిర్ణయాలను జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తోందని వారు మండిపడ్డారు. మరోవైపు, 14 ఏళ్లు గుర్తింపు సంఘంగా ఉండి కార్మికులను దోచుకున్న టీబీజీకేఎస్ , బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ‘కార్మిక గర్జన’ పేరిట మళ్లీ మోసగించడానికి చూస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 2015 ఎంఎండీఆర్ యాక్ట్‌కు మద్దతు తెలిపి సింగరేణికి బొగ్గు బ్లాక్‌లు దక్కకుండా చేసి 14 గనులు మూతపడేలా చేశారని, కానీ అప్పటి సీఎం కేసీఆర్ బంధువులకు మాత్రం సత్తుపల్లి, కోయగూడెం బ్లాక్‌లు కట్టబెట్టారని ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డా. జనక్ ప్రసాద్ చొరవతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తాడిచర్ల-2, మణుగూరు డిప్ సైడ్ బ్లాక్‌లను సాధించామని వారు గుర్తుచేశారు. త్వరలోనే ఆర్కే ఓసీ ఎక్స్‌టెన్షన్, శ్రావణపల్లి, మాదారం, గోలేటి ఓసీలకు అనుమతులు రానున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుంటే ప్రతిపక్ష సంఘాలు పనికిమాలిన విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గని పిట్ కార్యదర్శి బీమారపు సదయ్య అధ్యక్షతన జరిగినఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శంకరరావు, ఏరియా నాయకులు పవన్, కృష్ణమోహన్, రాజేందర్, నాగరాజు, స్వామి, రాజ్ కుమార్, సంపత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

You might also like