చావుతో సహవాసం చేసే సత్తా సింగరేణి కార్మికులదే..
చావుతో సహవాసం చేసే సత్తా ఉన్న కార్మిక సోదరులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నరా..? అంటే మన సింగరేణిలోనే ఉన్నరని గర్వంగా చెప్పుకోవచ్చునని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోదావరి ఖని సింగరేణి స్టేడియంలో సింగరేణి కార్మిక గర్జనలో కేటీఆర్ మాట్లాడుతూ.. పోరాటాల పురిటి గడ్డ రామగుండం అంటేనే రణగర్జన చేసే గడ్డ అన్నారు. ఇక్కడ కార్మికుల త్యాగమున్నది.. కార్మికుల కష్టమున్నది. నల్లబొగ్గుకు నెత్తురు అద్ది ఎన్నో సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికులున్నారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. చీకటి గుహల్లో రక్తతర్పణం చేసిన వాళ్లున్నారు. ఎన్నో త్యాగాలు చేసినవాళ్లున్నారని స్పష్టం చేశారు.
మీకు బొగ్గు ఉత్పత్తి చేయడమే కాదు.. ఉద్యమాలను ఉత్పత్తి చేయడం కూడా బ్రహ్మాండంగా తెలుసునని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యమాల్లో కూడా మొనగాళ్లు మీరని…. కేసీఆర్ పిలుపునిస్తే సకలజనుల సమ్మెలో 35 రోజులపాటు ఒకసారి, 7 రోజులు ఒకసారి 42 రోజులపాటు ఒక్క బొగ్గు పెళ్ల రాకుండా మీరు ఆరోజు తిరగబడితే మొత్తం దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయిందన్నారు. ఆ రోజుల కేసీఆర్ తెలంగాణ జెండా ఎగరేసి బయలుదేరితే ఆయనకు అండగా నిలబడ్డది.. ఇదే సింగరేణి కార్మిక లోకమనే మాట మేమెవరం మరిచిపోలేదని కేటీఆర్ అన్నారు. ఆ రోజు కేసీఆర్ కో అంటే కోల్ బెల్ట్ మొత్తం కో అని బయలుదేరారన్నారు.
ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలు, కార్మిక సోదరులు బోనస్ కోసం ఉద్యమాలు చేస్తారు.. తమ జీతాల కోసం ఉద్యమాలు చేస్తరు.. హక్కుల కోసం ఉద్యమాలు చేస్తారు.. కానీ సొంత రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన కార్మికులున్న ఒకే ఒక్క గడ్డ సింగరేణి అని నేను గర్వంగా చెబుతున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు.