అధికారులను అడ్డుకున్న కార్మికులు
తమకు వేతనాలు వెంటనే ఇవ్వాలని, పీఎఫ్ బకాయిలు సైతం వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉత్కంఠ రేపుతోంది. తమకు రావాల్సిన ఒక నెల వేతనంతో పాటు, సుమారు రూ.1.50 కోట్ల పీఎఫ్ బకాయిలను వెంటనే జమ చేయాలంటూ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ మున్సిపల్ కార్యాలయంలోకి అధికారులు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
వరుసగా నాలుగో రోజుకు చేరిన ఈ సమ్మెతో మున్సిపల్ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విధుల నిర్వహణ కోసం కార్యాలయంలోకి వెళ్లాల్సిన అధికారులు, కార్మికులు అడ్డుకోవడంతో బయటే పడిగాపులు కాస్తున్నారు. తమ శ్రమకు తగిన వేతనం చెల్లించడంతో పాటు, భవిష్యత్తుకు భరోసాగా నిలవాల్సిన పీఎఫ్ సొమ్మును వెంటనే తమ ఖాతాల్లో జమ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.