కార్మికుల కోసం పోరాడేది టీబీజీకేఎస్ మాత్రమే..
సింగరేణి(Singareni)లో కార్మికుల కోసం పోరాడేది టీబీజీకేఎస్(TBGKS) మాత్రమేనని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శ్రీరాంపూర్లోని టీబీజీకేఎస్ కార్యాలయంలో సివిల్ డిపార్ట్మెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం వారి ఆర్థిక ప్రయోజనాలు కాపాడేందుకు పోరాడే ఏకైక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అని స్పష్టం చేశారు. తాము కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.
సింగరేణిలో కార్మిక సంఘాల ఎన్నికల కాలపరిమితి అయిపోయిందని వెంటనే సింగరేణిలో ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఎన్నికల ముందు గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు, కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు అలవికానీ హామీలు ఇచ్చారని, అందులో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కార్మిక వర్గాన్ని మోసం చేశారని దుయ్యపట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన వాస్తవ లాభాలను దాచి పెట్టి తక్కువ లాభాలు చూపెట్టి సగటు కార్మికుడికి రూ. 50 వేల వరకు నష్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ఆయా సంఘాలు ఖండించకపోవడం శోచనీయమన్నారు.
ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ రెండు ఆర్థిక సంవత్సరాల కోసం సంస్థ భవిష్యత్ తరాల కోసం రూ. 6,323కోట్లు పక్కకు పెట్టామని యాజమాన్యం, ప్రభుత్వం చెబుతోందని, అవి ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని టీబీజీకేఎస్ సూటిగా ప్రశ్నిస్తోందన్నారు. ఆ 6,323 కోట్ల రూపాయలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు… కనీసం సింగరేణి కార్మిక వర్గానికి PPE కిట్లు, కనీస పనిముట్లు సమకూర్చలేని పరిస్థితులలో యాజమాన్యం ఉందన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు యాజమాన్యానికి, ప్రభుత్వానికి తొత్తులుగా మారి వారి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ఎద్దేవా చేశారు.
సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించి వారు ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 3 మెడికల్ బోర్డులు పెట్టాలని 100% ఇన్వాల్యుడేషన్ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు 300 మందికి వెంటనే ఇవ్వాలన్నారు. టీబీజీకేఎస్ సింగరేణి కార్మికుల సమస్యల పైన చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై సీనియర్ కార్మిక నాయకుడు కొలిపాక సమ్మయ్య, ప్యాగ మల్లేష్, చాంద్ పాషా తో పాటు 21 మంది సివిల్ డిపార్ట్మెంట్ కార్మికులు టీబీజీకేస్లో చేరారు. శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి, సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షుడు నూనె కొమరయ్య, సెంట్రల్ జాయింట్ సెక్రటరీ పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్, కేంద్ర కార్యవర్గ సభ్యులు నీలం సదయ్య, బిఆర్ఎస్ పార్టీ నస్పూర్ పట్టణ అధ్యక్షులు అక్కురి సుబ్బన్న, డివిజన్ నాయకులు చిలుకూరి జగదీష్, అమరేందర్ రావు, కానుగంటి చంద్రయ్య, గోపాల్, మంత్రి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు…