సింగరేణి విస్తరణే లక్ష్యం.. కార్మిక సంక్షేమమే ధ్యేయం!
సింగరేణి కార్మికులు, అధికారులకు భట్టి విక్రమార్క లేఖ
కొత్త గనుల సాధనతో పాటు థర్మల్, సోలార్ విద్యుత్ రంగాల్లో సింగరేణి సంస్థను విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బతుకమ్మ, దసరా, దీపావళి పర్వదినాలను పురస్కరించుకుని సింగరేణి కార్మికులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక లేఖ విడుదల చేశారు. కార్మిక సంక్షేమం, సంస్థ అభివృద్ధి, భద్రతకు సంబంధించిన పలు అంశాలను ఈ లేఖలో ప్రస్తావించారు.
సింగరేణి భవిష్యత్తుకు కార్మికుల శ్రమే పునాది.. సంస్థ అభివృద్ధికి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని భట్టి కోరారు. మారుతున్న బొగ్గు మార్కెట్లో పోటీని తట్టుకుని సంస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, అనవసర ఖర్చుల నియంత్రణ అవసరమన్నారు. భూగర్భ, ఉపరితల గనుల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కార్మికులు వెలికితీసే బొగ్గు రాష్ట్ర విద్యుత్ అవసరాలకు, అభివృద్ధికి కీలకమని తెలిపారు. విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో అంతరాయం కలగకుండా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఉత్పత్తి లక్ష్యాలు ఎంత ముఖ్యమో కార్మికుల భద్రత కూడా అంతే ముఖ్యమని, ప్రతి కార్మికుడు క్షేమంగా ఇంటికి చేరడమే తొలి విజయమని స్పష్టం చేశారు.
137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిని భావితరాలకు మరింత బలంగా అందించేందుకు కొత్త గనుల సాధనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఒడిశాలోని నైనీ బొగ్గు గనిలో ఉత్పత్తి ప్రారంభమైందని, తాడిచెర్ల-2 బ్లాక్‌కు మైనింగ్ లీజు పొందామని తెలిపారు. మణుగూరులోని ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్-2 డిప్ సైడ్ బ్లాక్‌ను వేలం ద్వారా దక్కించుకున్నామని, సత్తుపల్లి-3, కోయగూడెం-3 బ్లాక్‌లను తిరిగి సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరించారు. బొగ్గు రంగానికే పరిమితం కాకుండా విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, బంగారం, రాగి వంటి కీలక ఖనిజాల రంగాల్లోనూ సింగరేణి కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఇటీవల నిర్వహించిన సమీక్షలో పలు ఆదేశాలు ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 250 నుంచి 300 డిపెండెంట్ ఉద్యోగ నియామకాలను వేగవంతం చేయాలని, మారు పేర్ల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించాలని సూచించినట్లు చెప్పారు. సింగరేణి భూముల్లో అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు నెహ్రూ హౌసింగ్ కాలనీల ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల స్థానంలో కొత్త నివాసాల నిర్మాణం, కార్మిక కాలనీల అభివృద్ధి, ఏరియా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, క్యాథ్ ల్యాబ్ సదుపాయాల కల్పనపైనా దృష్టి సారించినట్లు తెలిపారు.
ప్రతి ఆరు నెలలకోసారి సేఫ్టీ కిట్లు పంపిణీ చేయాలని, పెర్క్స్, అలవెన్సులపై ఆదాయపు పన్నుకు సంబంధించిన కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన 1,754 కోట్ల రూపాయల నికర లాభాల్లో 34 శాతం, అంటే సుమారు 596 కోట్ల రూపాయలను కార్మికులకు లాభాల వాటా బోనస్‌గా పంపిణీ చేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి రెగ్యులర్ ఉద్యోగికి సగటున 1,53,912 రూపాయలు, కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి 5,500 రూపాయలు చెల్లించినట్లు వివరించారు. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా అందించడం వారి కృషికి ఇచ్చే గుర్తింపని పేర్కొన్నారు.
సింగరేణి విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతని, సంస్థను శ్రమతో, ఐక్యతతో మరింత అభివృద్ధి చేయడం కార్మికులు, ఉద్యోగులు, అధికారుల బాధ్యతని భట్టి విక్రమార్క తన లేఖలో స్పష్టం చేశారు. పూర్వీకులు కష్టపడి నిర్మించిన ఈ బొగ్గు సంస్థను కాపాడి, అభివృద్ధి చేసి భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. మొత్తంగా సింగరేణి విస్తరణ, కొత్త గనుల సాధన, కార్మికుల సంక్షేమం, వైద్య సదుపాయాలు, నివాసాల అభివృద్ధి.. ఇలా పలు అంశాలను తన పండుగ శుభాకాంక్షల లేఖలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రస్తావించారు.