టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నలమాస శ్రీకాంత్
తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) పార్టీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విజయదశమి సందర్భంగా వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఖరారు చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ కో-ఆర్డినేటర్, అబ్జర్వర్‌గా సయ్యద్ ఇస్మాయిల్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీకాంత్ గౌడ్ ప్రస్థానం ఇదీ…
డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ సుదీర్ఘమైన ఉద్యమ, విద్యా నేపథ్యం కలిగిన నాయకుడు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందిన ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పూర్తి చేశారు. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి దశ నుంచే చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ జాగృతి సంస్థ ప్రారంభమైన నాటి నుంచి కల్వకుంట్ల కవిత వెన్నంటి నడిచిన ఆయన.. పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ చర్చల్లో, ప్రజా సంఘాల వేదికలపై సమర్థవంతంగా గళం వినిపిస్తూ ప్రజల్లో విశేష గుర్తింపు పొందారు.
మా పార్టీ బహుజనుల గొంతు వినిపిస్తుంది..
బహుజనుల గొంతుకగా మూడేళ్లుగా అనేక ఉద్యమాలకు రూపకల్పన చేసిన కల్వకుంట్ల కవిత అదే సంప్రదాయాన్ని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటనలో కొనసాగించారని టీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. టీఆర్ఎస్ పేరుతో పార్టీని ప్రకటించిన తర్వాత… ఆ పార్టీ తరఫున ఎన్నికలలో అభ్యర్థులను బరిలో నిలపడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే దసరా పండుగ రోజునే పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే మొదటి అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్ పేరును కవిత ఖరారు చేశారని టీఆర్ఎస్ పార్టీ తెలిపింది.