ఆ సీఐని స‌స్పెండ్ చేయండి

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో ఉద్రిక్తత నెలకొంది. బతుకమ్మ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. స్థానిక గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ అకారణంగా చేయి చేసుకున్నారంటూ.. కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో గ్రామస్తులు, నాయకులు అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధ్యుడైన సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

తాళ్లపేటలో బతుకమ్మ వేడుకల్లో కాంగ్రెస్‌లోని రెండు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రమణమూర్తి.. సర్పంచ్, ఉపసర్పంచ్‌లపై అకారణంగా దాడి చేసి, విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత జగన్మోహన్ రావు వెంటనే తాళ్లపేటకు చేరుకుని, తన అనుచరులతో కలిసి అర్ధరాత్రి రాస్తారోకో చేపట్టారు. సీఐ రమణమూర్తిని సస్పెండ్ చేస్తామని డీసీపీ స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని వారు పట్టుబట్టారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత జగన్మోహన్ రావు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషం అన్నారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఏజెంట్లుగా మారారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటనపై సోమవారం ఉదయం డీసీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని జగన్మోహన్ రావు వెల్లడించారు. గిరిజన మహిళా సర్పంచ్‌పై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే.. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వేలాది మందితో పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

You might also like