తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
“రాజన్న సిరిసిల్ల జిల్లాలో బతుకమ్మ పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తంగేడు పూల కోసం అడవిలోకి వెళ్లిన ఓ వ్యక్తిపై ఎలుగుబంటి అనూహ్యంగా దాడి చేసింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి”
పండుగ పూట రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటన వెలుగు చూసింది. బతుకమ్మ వేడుకల కోసం అడవికి వెళ్లిన ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వంకాయల లక్ష్మణ్ అనే వ్యక్తి, బతుకమ్మ పండుగ సందర్భంగా పూలు కోసేందుకు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఎలుగుబంటి అకస్మాత్తుగా లక్ష్మణ్ పై దాడికి పాల్పడింది.
ఈ అనూహ్య దాడిలో లక్ష్మణ్ తలపై తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మణ్ను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పండుగ వేళ అడవికి వెళ్లిన వ్యక్తిపై అడవి జంతువు దాడి చేయడంతో రుద్రంగి మండలంలో కలకలం రేగింది. స్థానికులు, అటవీ ప్రాంతానికి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.