ద‌స‌రా ఎఫెక్ట్‌.. భారీగా ట్రాఫిక్ జామ్

పండుగకు సొంతూళ్ల బాట ప‌ట్ట‌డంతో బ‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిట‌కిట‌లాడుతున్నాయి… ఇక‌ టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డుతోంది. సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్ల బాట పట్టారు. వరుస సెలవులు రావడంతో కుటుంబాలతో కలిసి పల్లెలకు బయలుదేరుతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరగడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దసరా పండుగకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు బయలుదేరడంతో వాహనాల రాకపోకలు పెరిగాయి. మొత్తం 16 టోల్ బూత్‌లలో విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం ఎనిమిది, హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల కోసం మరో ఎనిమిది బూత్‌లను అందుబాటులో ఉంచినట్లు సిబ్బంది తెలిపారు. నాలుగు గంట‌ల పాటు ట్రాఫిక్‌జాం అవుతోంద‌ని ప‌లువురు చెబుతున్నారు.

సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) కిటకిటలాడుతోంది. రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల్లో సీట్లు దక్కించుకునేందుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. పండుగ రద్దీ నేపథ్యంలో టికెట్ ధరలపై అదనపు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సర్వీసుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప‌లువురు దుయ్య‌బ‌డుతున‌నారు.

సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (JBS), సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ ప్రయాణికుల రద్దీ పెరిగింది. వరుస సెలవులతో ప్రజలు ముందుగానే ప్రయాణాలు ప్రారంభించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ నెలకొంది. ముఖ్యంగా కుటుంబాలతో ప్రయాణించే వారు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

 

You might also like