తాళ్లపేటలో ఉద్రిక్తత..
-బతుకమ్మ ఆడుతున్న మహిళలపై చేయి చేసుకున్నారని ఆరోపణలు
-రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ప్రజలు
-సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్
బతుకమ్మ వేడుకల్లో జరిగిన ఓ వాగ్వాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో గిరిజన మహిళా సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌పై పోలీసులు లాఠీచార్జ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి వ్యవహరించిన తీరుపై గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్థులు చెప్పిన వివరాల ప్రకారం… కాంగ్రెస్ నాయకుడు ఒకరు బతుకమ్మ ఆడుతున్న మహిళలపై టపాసులు వేయడంతో వివాదం మొదలైంది. దీంతో మహిళలు ఆయనను నిలదీయడం, అది కాస్తా వాగ్వాదంగా మారింది. ఈ ఘటనలో గిరిజన మహిళా సర్పంచ్ కళావతిపై ఆ నాయకుడు దాడి చేశారని గ్రామస్తులు ఆరోపించారు.
వివాదంపై సమాచారం అందుకున్న పోలీసులు తాళ్లపేట గ్రామానికి చేరుకున్నారు. అయితే, ఇరువర్గాలకు సర్దిచెప్పాల్సిన పోలీసులు గిరిజన సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ తిరుపతిపై లాఠీచార్జ్ చేశారని గ్రామస్తులు ఆరోపించారు. సీఐ రమణమూర్తి అకారణంగా దాడి చేశారని గ్రామస్తులు ఆరోపించారు. సీఐ రమణమూర్తి అకారణంగా దాడి చేశారని పేర్కొంటూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడిపై చర్యలు తీసుకోవడంతోపాటు, సీఐ రమణమూర్తిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు సైతం ఆందోళనకు దిగారు.