సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరిలో ద‌స‌రా వేడుక‌లు

త‌న స్వగ్రామమైన‌ కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకల్ని జరుపుకున్నారు. జమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పండగవేళ స్వగ్రామానికి వచ్చిన రేవంత్‌ రెడ్డికి డప్పు చప్పుళ్లు, గజమాలలు, పూల జల్లులు, సంప్రదాయ బతుకమ్మలతో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.

సీఎం రేవంత్‌ రెడ్డి దసరా పండగను తన స్వగ్రామం నాగర్‌ కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపలిల్లో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా దసరా వేడుకల్లో పాల్గొన్నారు. స్వగ్రామానికి చేరుకున్న రేవంత్ రెడ్డికి ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఓపెన్‌టాప్ జీపులో గ్రామంలోకి బయలుదేరిన సీఎంకు మార్గమధ్యలో గ్రామస్థులు, మహిళలు, అభిమానులు సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలుకుతూ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం ద‌గ్గ‌ర ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పండితులు ఆశీర్వచనాలిచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం వేళ కోట మైసమ్మ అమ్మవారిని సీఎం దర్శించుకున్నారు. జమ్మి చెట్టుకు శమీ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అంతకు ముందు హెలికాఫ్టర్​లో కొండారెడ్డిపల్లికి చేరుకున్న రేవంత్ రెడ్డికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు పూల బొకేలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఓపెన్ టాప్​ జీపులో భారీగా హాజరైన కార్యకర్తలను పలకరించుకుంటూ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వచ్చారు. దారిపొడుగునా గజమాలలు, పూలవర్షంతో కార్యకర్తలు, స్థానికులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

You might also like