తుమ్మిడిహెట్టి బ్యారేజీపై కీలక ముందడుగు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) రైతాంగం సాగు, తాగునీటి కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) కీలక అడుగు వేసింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ(Thummidihetti Barrage) ఎత్తు 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపాదనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Maharashtra CM Devendra Fadnavis సానుకూలంగా స్పందించారు. ముంబై వేదికగా జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల భేటీతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయే మార్గం సుగమమైంది.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తుమ్మడిహెట్టి ప్రాజెక్టుపై సోమవారం ముంబై సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్ లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం సమావేశమైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందం బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించింది. దీనివల్ల గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలు మెరుగుపడటంతో పాటు విద్యుత్, నిర్వహణ వ్యయాలు తగ్గుతాయని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. ముంపు, నీటి లభ్యత, పరిహారం, సాంకేతిక అంశాలపై అధ్యయనం చేసేందుకు ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
తెలంగాణలో సాగునీటి అవసరాలు తీర్చడం… వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సమస్యలను పరిష్కరించి, నిర్మాణానికి మార్గం సుగమం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం కీలక చర్చలు జరిపింది. ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఈ భేటికి సంబంధించిన విషయాలు వెల్లడించింది.
సమావేశం ప్రారంభంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(State Irrigation Minister Uttam Kumar Reddy) ప్రజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరించారు. సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిపోయిందని తెలిపారు. 2016లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరిందని గుర్తుచేశారు. అయితే, ఈ ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే తెలంగాణ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ప్రస్తుత విద్యుత్ అవసరాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం కూడా ముఖ్యమైన అంశమన్నారు. అందుకే గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఈ పరిస్థితుల్లో తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడమే అత్యంత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమని వివరించారు. సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక అంశాల పరంగా ఈ ప్రతిపాదనకు ఉన్న ప్రాధాన్యాన్ని మంత్రి వివరించారు. బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో అమల్లో ఉన్న భూసేకరణ నిబంధనలు, ఆ రాష్ట్ర పరిహార విధానం ప్రకారం రైతులకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ – మహారాష్ట్ర మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేశారు. పూర్వ హైదరాబాద్ సంస్థానంతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు ఉన్న చారిత్రక అనుబంధాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు సాగు, తాగునీటి సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కోరారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. సరిహద్దులోని ఆదిలాబాద్ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంచాలన్న తెలంగాణ అభ్యర్థన మరోసారి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తుది నిర్ణయానికి వచ్చే ముందు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్రకు, తమ ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోతే 148 మీటర్ల ఎత్తు ఒప్పందాన్ని పున: పరిశీలించేందుకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ నీటి అవసరాలకు సహకరించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
స్నేహభావం, సోదరభావంతో మంచి పొరుగు రాష్ట్రాలుగా ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఇతర రాష్ట్రాలతో మహారాష్ట్ర పలు అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుందని గుర్తుచేశారు. పరస్పర చర్చలు, సహకారంతో ఆయా సమస్యలకు పరిష్కారం కనుగొన్నామని వివరించారు. తుమ్మిడిహెట్టి విషయంలో కేంద్ర జల సంఘం తన పరిధిలో అవసరమైన అధ్యయనాలు చేపడుతుందని తెలిపారు. సాంకేతిక పరిశీలనలు కొనసాగిస్తుందన్నారు. ఈలోపు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యతపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు.
మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములు, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలన్నారు. పరిహారం, ఇతర సాంకేతిక అంశాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పారు. ముంపు ప్రభావం, ప్రభావిత భూముల విస్తీర్ణంపై రెండు రాష్ట్రాల అంచనాలను పరిశీలించాలని సూచించారు. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే ప్రత్యామ్నాయాలను కూడా అధ్యయనం చేయాలన్నారు. రెండు రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులు సంప్రదింపులు జరపాలని సూచించారు. తదుపరి సమావేశాల నిర్వహణ, కాలపరిమితులను నిర్ణయించాలన్నారు. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.