నేను చ‌స్తేనే బిల్లులు ఇస్తారా..? కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పూర్తయిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. తన నియోజకవర్గానికి నిధులు విడుదల చేయకపోతే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికైనా సిద్ధమని ప్రకటించారు. మంత్రుల నియోజకవర్గాలకే బిల్లులు చెల్లిస్తారా? మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇవాళ రాజాపూర్‌ మండల పరిధిలోని రంగారెడ్డిగూడ, గుండ్ల పొట్లపల్లి సహా పలు గ్రామాల్లో అనిరుధ్ రెడ్డి పర్యటించారు. గ్రామాల్లో ప్రజలను కలిసి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటికే పూర్తయిన, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగకపోతే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నించారు.

స్థానికంగా జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి మాట్లాడుతూ.. జడ్చర్ల నియోజకవర్గంలో 30 వేల మందితో దీక్షలకు కూర్చుంటా. చచ్చిపోయేంత వరకు కూర్చుంటా.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధులియ్యాల్సిందే. రోడ్లు పూర్తి చేయాల్సిందే. మనకు రోడ్లు ఇచ్చింది ఎవరు..? నా గురువు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆయననే అడుగుతున్నా.. అన్నా కొబ్బరికాయకొట్టి పోయినవ్‌ అని ప్రశ్నించారు.

మళ్లీ భట్టి విక్రమార్క పాదయాత్రకు వస్తే జడ్చర్లలో 30-40 వేల మందితో ఆ రోజు నేను సభ చేసిన. భట్టి విక్రమార్కను కూడా అడుతుగున్నా.. నా నియోజకవర్గంలో కొందరిలా మీరు బిల్లులు ఇయ్యండి.. లేకుంటే నేను ఆమరణ నిరాహాక దీక్షకు కూర్చుని.. ఇక చచ్చిపోనన్నా చనిపోతా కానీ నిధులు మాత్రం జడ్చర్లకు ఇయ్యాల్సిందే.. ఒకవేళ అనిరుధ్‌ రెడ్డి చచ్చిపోతెనే జడ్చర్లకు నీళ్లు ఇస్తామంటే.. నేను అమరణ నిరాహార దీక్షలో నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి.. ఓ నాగర్‌కర్నూల్‌ ఆర్‌అండ్‌ బీ కాంట్రాక్టర్‌ చచ్చిపోతే కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి రూ.40 కోట్లు విలువనా..? లేదా నా ప్రాణం విలువనా..? అనేది మా ప్రభుత్వం నిర్ణయించుకోవాలని ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి హితవు పలికారు.

ఇటీవల ఓ కాంట్రాక్టర్‌ మరణించిన సందర్భంలో ఆయనకు సంబంధించిన రూ.5 కోట్ల బిల్లు మంజూరైన విషయాన్ని ప్రస్తావిస్తూ అనిరుధ్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల కోసం నేను ప్రాణాలు కోల్పోవాల్సిందేనా ? అప్పుడే నిధులు విడుదల చేస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు పదేపదే ప్రభుత్వాన్ని అభ్యర్థించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. పెండింగ్‌ బిల్లుల సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తానని హెచ్చరించారు. అవసరమైతే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

జడ్చర్ల నియోజకవర్గానికి సాగునీరు అందించే విషయంలో రాజకీయాలకు అతీతంగా పోరాడతానని అనిరుధ్‌ రెడ్డి తెలిపారు. రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని, నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు నీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి పోరాటానికైనా వెనుకాడబోనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం, పూర్తయిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. జడ్చర్లలో పెండింగ్‌ బిల్లుల సమస్యను వెంటనే పరిష్కరించి అభివృద్ధి పనులకు ఆటంకాలు తొలగించాలని డిమాండ్‌ చేశారు. కాగా, సొంత పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వ తీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనూ అనిరుధ్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.

You might also like