బహిరంగ సభ విజయవంతం చేయాలి
ఏఐసీసీ పరిశీలకులు మరియప్ప..
భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఏఐసీసీ పరిశీలకులు మరియప్ప అన్నారు. మంచిర్యాలలోని శుభం కన్వెన్షన్ లో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటు హక్కు పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం, ఎన్నికల సంఘం తప్పిదాలకు శిక్షలు పడకుండా చట్టాలు రూపొందించారంటూ ఆరోపించారు.
దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు. గతంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమం విజయవంతమైందని మరియప్ప గుర్తుచేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల)కు బదులుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. నవంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం జిల్లా కోఆర్డినేటర్ శ్రావణ్ రావు మాట్లాడుతూ దేశ ప్రజలకు సంబంధించిన అంశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవహారశైలిపై విమర్శలు చేశారు.. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు పిన్నింటి రాఘనాథ్ రెడ్డి, మంచిర్యాల నగర కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, హజీపూర్ మండల అధ్యక్షులు తోట రవి, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు జాలే రాయలింగు, చాతరాశి రాజేష్ , డాక్టర్ సెల్ అధ్యక్షురాలు చందన పాల్గొన్నారు..