అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లలో తనిఖీలు..
మంచిర్యాల పోలీసులు గురువారం అర్ధరాత్రి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్‌నగర్‌లో రౌడీషీటర్ల ఇళ్లను మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాష్, ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లు ఏం చేస్తున్నారు…?
వారి కార్యకలాపాలు..? ప్రవర్తన.. తదితర అంశాలను పోలీసులు పరిశీలించారు. అనంతరం వారితో మాట్లాడి కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ప్రశాంతమైన జీవనం కొనసాగించాలని సూచించారు.
ఈ సందర్భంగా డీసీపీ ఎ.భాస్కర్ మాట్లాడుతూ.. రౌడీషీటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. సత్ప్రవర్తనతో జీవిస్తే, నిబంధనల ప్రకారం వారి రౌడీషీట్లను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. గొడవలు, బెదిరింపులకు పాల్పడడం, శాంతి భద్రత లకు పాల్పడితే రౌడీ షీటర్స్ తెరుస్తామని డీసీపీ తెలిపారు. ఎవరైనా రౌడీషీటర్ తిరిగి నేర కార్యకలాపాలకు పాల్పడినా, అసాంఘిక శక్తులతో సంబంధాలు కొనసాగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ సూచించారు.ప్రజల సహకారంతో నేరరహిత, ప్రశాంతమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.