ఒడిశాలో సింగరేణి విస్తరణ పనులపై వేగం
-అంగూల్ జిల్లా కలెక్టర్‌తో సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి భేటీ
-నైనీ గని, థర్మల్ ప్లాంట్, ఆర్ అండ్ ఆర్ కాలనీల స్థల కేటాయింపుపై చర్చలు
-సింగరేణికి పూర్తి సహకారం అందిస్తామన్న అంగూల్ కలెక్టర్
-ప్రపంచంలోనే తొలి కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ సందర్శించిన సింగరేణి బృందం
ఒడిశాలో సింగరేణి కార్యకలాపాల విస్తరణ వేగవంతమైంది. నైనీ బొగ్గు గని, ప్రతిపాదిత థర్మల్ విద్యుత్ కేంద్రం, నిర్వాసితుల పునరావాసం వంటి కీలక అంశాలపై సింగరేణి యాజమాన్యం ఒడిశా అధికారులతో చర్చలు జరిపింది. మంగళవారం అంగూల్ జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దాల్ అక్తర్‌తో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థలాల కేటాయింపు, అనుమతులపై సుదీర్ఘంగా చర్చించారు. దేశ విద్యుత్ అవసరాలు తీరుస్తున్న సింగరేణికి తమ పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
నైనీ ప్రాజెక్టును వేగంగా పట్టాలెక్కించేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు ముమ్మరం చేసింది. సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరెక్టర్లు గౌతమ్ పోట్రు, ఎల్. వి. సూర్యనారాయణ, ఇతర అధికారులు అంగూల్ జిల్లా కలెక్టర్‌తో కీలక భేటీ నిర్వహించారు. నైనీ బొగ్గు గని వల్ల నిర్వాసితులైన 40 కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణం కోసం స్థలం మంజూరు చేయాలని కోరారు. నైనీ గనికి అనుబంధంగా ఏర్పాటు చేయనున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం.. తుకుడా, జరపడా గ్రామాల్లో స్థలాన్ని గుర్తించామని, భూసేకరణకు సహకరించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
బొగ్గు రవాణా కోసం చండీపడా-జరపడా గ్రామాల మధ్య నిర్మించనున్న బైపాస్ రోడ్డు కోసం సింగరేణి ఇప్పటికే 35 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిందని సీఎండీ గుర్తుచేశారు. దీంతో పాటు మాఝికా బైపాస్ రోడ్డు నిర్మాణం, ఒడిశాలో సింగరేణి కార్యాలయం, ఉద్యోగుల నివాస కాలనీ నిర్మాణానికి అవసరమైన స్థలాలను కేటాయించాలని అధికారులను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. సింగరేణికి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు అంగూల్ జిల్లాలో జిందాల్ సంస్థ ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే తొలి కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్‌ను సింగరేణి బృందం సందర్శించింది. దేశీయ బొగ్గుతో గ్యాస్ ఉత్పత్తి చేసి వినియోగిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సింగరేణిలో మూతపడిన భూగర్భ గనుల నుంచి కోల్ గ్యాసిఫికేషన్ కు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ రాయితీలపై నిపుణులతో సీఎండీ చర్చించారు. కాగా, ఈ జిందాల్ ప్లాంట్‌కు సింగరేణి నైనీ గని నుంచే కొంత బొగ్గు రవాణా అవుతుండటం విశేషం.