ఇద్దరు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సస్పెన్షన్
ఆదిలాబాద్ జిల్లా యాపల్ గూడ రెండో బెటాలియన్ లో అధికారులు కొరడా ఝుళిపించారు. వివాదాల్లో చిక్కుకున్న టీజీఎస్పీకి చెందిన ఇద్దరు రిజర్వ్ ఇన్స్పెక్టర్లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అక్రమ వసూళ్లు, సిబ్బంది వేధింపులు, హత్యాయత్నం ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. ఇద్దరు ఆర్ఐలను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
2వ బెటాలియన్ కు చెందిన ఆర్ఐ ఏ.రమేష్ పై సిబ్బంది నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. డ్యూటీకి డుమ్మా కొడితే డబ్బులు వసూలు చేయడం, సిబ్బందిని వేధించడం లాంటి చర్యలకు రమేష్ పాల్పడినట్లు తేలింది. ఇక మరో ఆర్ఐ ఎం.నరేష్, ఆర్ఎస్ఐ రాకేష్ పై ఏకంగా హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసు అధికారులే ఇలా అక్రమాలకు, నేరాలకు పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
రెండో బెటాలియన్ లో జరుగుతున్న ఈ అక్రమ వసూళ్లు, సిబ్బంది వేధింపులపై సీరియస్ గా దృష్టి సారించారు. వెంటనే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో.. ఆర్ఐలు ఏ.రమేష్, ఎం.నరేష్ లను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.