క్షమాపణలు చెప్పేవారు చాలా మంది ఉన్నారు
నిజం నిలకడ మీద తేలుతుందని పెద్దలు చెప్పారని.. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన మరికొందరు కూడా భవిష్యత్తులో క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కొండా సురేఖ క్షమాపణలపై మీడియా ప్రశ్నించగా కేటీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. ‘నిజం నిలకడ మీదే తేలుతుంది. మొన్న ఒక వార్తాపత్రిక కూడా క్షమాపణ చెప్పింది. ఈరోజు కొండా సురేఖ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఇంకా క్షమాపణలు చెప్పేవారు చాలామంది ముందు వరుసలో ఉన్నారు. మాపై ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారు భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెబుతారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే తనకు ఇప్పుడే ఈ విషయం తెలిసిందని చెప్పిన కేటీఆర్.. అసలు కొండా సురేఖ ఏం ట్వీట్ చేశారో తాను ఇంకా చూడలేదని తెలిపారు. ఆమె ప్రకటనపై పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత.. తమ న్యాయ విభాగాన్ని సంప్రదించి మరిన్ని వ్యాఖ్యలు చేస్తానని కేటీఆర్ వెల్లడించారు. తమపై గతంలో చేసిన ఆరోపణల విషయంలో నిజాలు బయటకు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి గతంలో చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొండా సురేఖ తాజాగా వివరణ ఇచ్చారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ వ్యాఖ్యలు చేశానని.. అయితే అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని పేర్కొన్నారు. తాను గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు నిరాధారమైనవని.. అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. వారి ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే దురుద్దేశం కూడా లేదని ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యల వల్ల కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురై ఉంటే అందుకు చింతిస్తున్నట్లు కొండా సురేఖ పేర్కొన్నారు. తాను గతంలో కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.