పోలీసులు, డాక్టర్ పై కేసు నమోదు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యువకుడి ఆత్మహత్య విషయంలో పోలీసులు, ఓ డాక్టర్‌తో పాటు స్టాఫ్ నర్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వికలాంగుల కాలనీ కి చెందిన రాహుల్ కాంబ్లే (26) అనే యువకుడు గురువారం తెల్లవారు జామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు రిమ్స్ వైద్య సిబ్బంది, టూ టౌన్ పోలీసులే కారణం అంటూ పేర్లతో సహా యువకుడి సూసైడ్ నోట్ రాశాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రిమ్స్ వైద్యుడు సౌరబ్, స్టాఫ్ నర్స్ మమత, టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ ఫతే సింగ్, బ్లూకోర్టు కానిస్టేబుల్ జీవన్, హోంగార్డు నవీన్ లపై కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్ పట్టణంలోని వికలాంగుల కాలనీకి చెందిన రాహుల్‌కు తేలు కుట్టడంతో చికిత్స కోసం మంగళవారం రాత్రి రిమ్స్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైద్యులు, సిబ్బందితో ఆయన వాగ్వాదానికి దిగి వీడియో రికార్డు చేశాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఆదిలాబాద్ టౌన్-2 పోలీసులు అక్కడికి చేరుకుని రాహుల్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు తనను మందలించారని, కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన రాహుల్.. తన చావుకు వైద్యులు, పోలీసులే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. రాహుల్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతో పాటు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు రిమ్స్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.