ఏసీబీ అధికారుల మెరుపుదాడి.. పట్టుబడ్డ భైంసా ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్

నిర్మల్ జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. భైంసా ఇన్ ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న జాదవ్ సంతోష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక పని నిమిత్తం 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో వల పన్నారు. భైంసా ఇన్ ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్ బాధితుడి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా.. మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంటనే కమిషనర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు.. నేరుగా ఆయన ఇంటికి తీసుకెళ్లి సోదాలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో జరిగిన ఇతర ఆర్థిక లావాదేవీలు, కీలక దస్త్రాలపై అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. అయితే, కమిషనర్ ఏ పని కోసం బాధితుడిని ఈ లంచం డిమాండ్ చేశారు? ఇంట్లో జరుపుతున్న సోదాల్లో ఏమేం దొరికాయి? అనే పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు మరి కాసేపట్లో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

You might also like