ఆంధ్రాకు నీళ్లు… తెలంగాణకు వెక్కిళ్లు
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రాప్రాంతానికి నీళ్లు పంపించి తెలంగాణకు వెక్కిళ్లు మిగిల్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిర్మల్లో నిర్వహించిన ‘రైతు గర్జన’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను పడావు పెట్టారని, గోదావరి, కృష్ణా జలాలను వదిలిపెట్టారని ఆరోపించారు. ఇది ప్రకృతి ఇచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ పాలకులు తెచ్చిన కరువు అని మండిపడ్డారు.
పట్టిసీమ దగ్గర చంద్రబాబు నీళ్లు ఎత్తిపోస్తుంటే, రేవంత్ రెడ్డి కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తిపోయలేదని విమర్శించారు. నీటిని ఎత్తిపోస్తే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అయ్యేదన్నారు. మాయ మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసగించిందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.
కాళేశ్వరంతో తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశారని, మిషన్ కాకతీయతో మండుటెండల్లోనూ చెరువుల్లో నీరు మత్తళ్లు దూకాయని గుర్తుచేశారు. మిషన్ భగీరథతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా, 60 ఏళ్ల కరెంట్ కష్టాలను కేసీఆర్ తీర్చి రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించారని కేటీఆర్ కొనియాడారు.